జనసేన ఆవిర్భావ సభ సక్సెస్, పవన్ ఫెయిల్యూర్ అన్నట్టుగా ఉంది. సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగం ముగింపులో ఇచ్చిన ట్విస్ట్‌కు జనసేన కార్యకర్తలు, నాయకులు షాక్ అయ్యారు.
జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. పవన్‌పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన నేతే భారీగా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావడం రాజకీయ విచిత్రం.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీజేపీని రోడ్‌మ్యాప్ అడగటం ఏంటని ప్రశ్నించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును తిట్టి ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన పవన్‌కల్యాణ్, రానున్న ఎన్నికల్లో టీడీపీ పొత్తు కోసం వెంపర్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆయనతో కలసి పొత్తుపెట్టుకోవడాన్ని ప్రజలు హర్షించరని బాలినేని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అమలవుతున్నాయన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాలని బాలినేని హితవు పలకడం గమనార్హం.
చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై పవన్ తన ఆరోపణలను వెనక్కి తీసుకోలేదని ఇటీవల జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ పదేపదే చెబుతున్నారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజీ కలిగిస్తున్న నేపథ్యంలో ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బొలిశెట్టి మాటలే మంత్రి బాలినేని నోట రావడాన్ని గమనించొచ్చు.