తెలుగుదేశం పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏ దేశంలో ఉన్నారనేది ఒకిత రహస్యంగా ఉంది. ఆయన యూరప్ పర్యటనకు వెళ్లారని మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అంతకుమించి వివరాలను అందించలేదు. దాదాపు నాలుగైదు రోజుల పాటు సేదతీరడానికి చంద్రబాబు నాయుడు వెళ్లినట్టుగా సమాచారం. అయితే ఇంతలోనే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం తలెత్తింది.
చంద్రబాబు నాయుడు అటు వెళ్లారో లేదో ఇటువైపు పార్టీ ఎంపీలు తిరుగుబావుటా ఎగరేశారు. ఈ అంశంపై చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయినట్టుగా టీడీపీ ప్రకటించింది. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు అని చెప్పారట చంద్రబాబు నాయుడు. భారతీయ జనతా పార్టీ చర్యను చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారట! తాము రాష్ట్రం కోసం పోరాడినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించుకున్నారట. పార్టీకి సంక్షోబాలు కొత్త కాదు అని, అలాంటి వాటిని ఎన్నింటినో ఎదుర్కొని పార్టీ నిలిచిందని చంద్రబాబు నాయుడు తమ వారిలో ధైర్యం నింపేయత్నం చేశారట.
బీజేపీది అప్రజాస్వామ్యిక చర్య అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ తీరును తీవ్రంగా ఖండించినట్టుగా తెలుస్తోంది. మరి ప్రజాస్వామ్యం గురించి, ఇలాంటి ఫిరాయింపు వ్యవహారాల గురించి చంద్రబాబు నాయుడే మాట్లాడాలి! ఫిరాయింపు రాజకీయాలను గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణమైన స్థితికి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టుగా కొన్నారాయన. ఈ సంతలో పశువులు అనేది ఆయన సొంతంగా వాడినమాటే.
తను ఎమ్మెల్యేలను కొనడాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు సమర్థించుకున్నారు. ఇప్పుడు తన ఎంపీలను మరొకరు తోలుకుపోతుంటే మాత్రం వారి తీరు దారుణంగా కనిపిస్తూ ఉంది చంద్రబాబుకు. తను చేస్తే ఒకటి, మరొకరు చేస్తే ఇంకొకటి. ఇదీ చంద్రబాబు నాయుడి తీరు అని మరోసారి స్పష్టం అవుతోందని పరిశీలకులు అంటున్నారు.