రాజకీయ నిరుద్యోగుల్ని, కార్యకర్తల్ని సంతృప్తి పరచడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తుంటాయి. రకరకాల పథకాలతో రాష్ట్ర ఖజానా నుంచే అధికారికంగా వారిని పోషిస్తుంటాయి. గత టీడీపీ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇలాగే టీడీపీ కార్యకర్తల జేబులు నింపింది. ఇంచార్జ్ ల పేరుతో ఓడిపోయిన వారికి కూడా అభివృద్ధి పనుల్లో వాటాలు ఇచ్చి, పథకాల్లో అవినీతిని ప్రోత్సహించింది టీడీపీ.
ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలో లేని సమయంలో కష్టనష్టాలు ఓర్చుకుని నమ్మకంగా పనిచేస్తున్న కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు మాకేంటి అని ఆలోచిస్తున్నారు. గ్రామవాలంటీర్ల రిక్రూట్ మెంట్ మొదలు కాబోతుండటంతో వారందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దీనికోసం పైరవీలు కూడా జరుగుతున్నాయనేది వాస్తవం. అయితే టీడీపీ దీనిపై విష ప్రచారానికి దిగుతోంది.
గ్రామ వాలంటీర్ల పోస్టులన్నీ వైసీపీ కార్యకర్తలకే ఇస్తారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఒకరకంగా నిరుద్యోగ యువతను రెచ్చగొడుతోంది, మరోవైపు వైసీపీ కార్యకర్తల్లో లేనిపోని ఆశలు రేకెత్తించి అయోమయానికి గురి చేస్తోంది. 4 లక్షలకు పైగా ఉద్యోగాలంటే మాములు విషయం కాదు.
సొంత ఊరిలో పని, పలుకుబడితో పాటు 5వేల జీతం. ఇంకేంకావాలి అనుకుంటున్నారు చాలామంది. అలాంటి వారి బలహీనతను ఆసరాగా చేసుకొని.. తప్పుడు వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. వాలంటీర్ల పోస్టులకు అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నాయి. అయితే అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు.
వాలంటీర్ల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా జరగాలనేది సీఎం జగన్ ఆలోచన. నిరుద్యోగ భృతి కేవలం టీడీపీ కార్యకర్తలకే ఇచ్చినట్టు, వాలంటీర్ల పోస్టులు కేవలం వైసీపీ వారికే ఇస్తే.. ఇక చంద్రబాబుకీ జగన్ కీ తేడా ఏంటి? అందుకే జగన్ ఈ ఉద్యోగాల భర్తీపై చాలా కసరత్తు చేస్తున్నారు. ఎక్కడా పార్టీ వాసనలు లేకుండా ఉండాలనే ఆలోచనతో ఉన్నారు.
మంత్రి పదవుల విషయంలో తీవ్ర అసంతృప్తులున్నా.. సామాజిక న్యాయం పాటించారు జగన్. సీనియర్లు కస్సుబుస్సులాడినా పట్టించుకోలేదు. కేబినెట్ కూర్పులో ఇంత కఠినంగా ఉన్న జగన్.. వాలంటీర్ల పోస్టుల భర్తీలో యువతకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోరు. కాబట్టి ఈ పోస్టులకు రాజకీయ రంగు పులమాలని చూస్తున్న టీడీపీ జిత్తులకు జగన్ చెక్ పెట్టడం ఖాయం.
ఈ మొత్తం ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగేలా ఓ సరికొత్త వ్యవస్థను, యంత్రాంగాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు జగన్.