ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండగా ఆ పార్టీని సంక్షోభం చుట్టుముట్టినట్టుగా ఉంది. ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు ఒకేసారి తెలుగుదేశం పార్టీనీ వీడుతుండగా, మరోవైపు కాపు సామాజికవర్గం నేతల భేటీ కలకలం రేపుతూ ఉంది. వాళ్లంతా జాయింటుగా తెలుగుదేశం పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారని, అంతా కలిసి కట్టుగా భారతీయ జనతా పార్టీలోకి చేరే ప్రయత్నంలో ఉన్నారనే మాట వినిపిస్తూ ఉండటం గమనార్హం.
తెలుగుదేశం పార్టీని ఈ సంక్షోభం పట్టి ఊపేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అలా విదేశీ పర్యటనకు వెళ్లారో లేదో ఇంతలోనే నేతలు టీడీపీని వీడటానికి రెడీ అయిపోవడం గమనార్హం!
ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వెళ్లి ప్రధాని మోడీతోనూ, అమిత్ షాతోనూ సమావేశం అయినట్టుగా తెలుస్తోంది.
తాము తెలుగుదేశం నుంచి బయటకు వచ్చినట్టూగా రెండోవంతు సభ్యులు బయటకు వచ్చిన నేపథ్యంలో తమను ప్రత్యేకంగా గుర్తించాలని వారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కోరనున్నారట. ఈ విషయంలో వెంకయ్య ఎలాగూ అభ్యంతరం చెప్పలేరనేది స్పష్టం అవుతున్న విషయమే. ఒకరిద్దరు అయితే అనర్హత అని వాదించే అవకాశం ఉంది. ఒకేసారి నలుగురు చేరడం వల్ల విలీనం అనడానికి అవకాశం లభించినట్టుగా ఉంది.
ఢిల్లీలోని ఆ ఫిరాయింపు రాజ్యసభ్యులు కాపునేతలకు కూడా సంకేతాలు పంపిస్తున్నారని, గంపగుత్తగా అందరూ బీజేపీలోకి చేరడానికి వారు రెడీ అవుతున్నారని టాక్ వస్తోంది. చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి తిరిగి వచ్చే సరికి ఇక్కడ వ్యవహారం అంతా సెటిల్ అయిపోతుందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అంటుండటం గమనార్హం!