రుణమాఫీ హామీ విషయంలో 2014 ఎన్నికల ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు ఏం చెప్పారనే అంశం గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి రైతులకు ఆ విషయం గురించి అవగాహన ఉంది. రైతు రుణమాఫీ సాధ్యంకాదని అప్పుడు జగన్ మోహన్ రెడ్డి సూటిగా స్పష్టంగా చెప్పారు. అందుకే తను ఆ హామీని ఇవ్వడం లేదని జగన్ తేల్చిచెప్పారు.
అయితే చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ హామీని ఇచ్చారు. అది సాధ్యం అన్నారు. తను చేసి చూపిస్తానంటూ ప్రగల్బాలు పలికారు. చేతకానప్పుడు జగన్ కు ఓటెందుకు వేయాలంటూ తెలుగుదేశం వాళ్లు ప్రచారం చేశారు. రైతులు చంద్రబాబు వాదనను మెచ్చారు. రుణమాఫీకి ఆశపడి టీడీపీకి ఓటేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
సంపూర్ణ రుణమాఫీ అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రకరకాల రీజన్లు చెప్పి అనేకమంది రుణమాఫీకి అనర్హులుగా తేల్చారు. అర్హులని తేల్చిన వారికి కూడా ఐదు విడతల్లో ఏడాదికో విడత మాఫీ అని అన్నారు. ఆ మాఫీ సొమ్ములు సరిగా మూడు సంవత్సరాలు కూడా వేయలేకపోయారు. అనేకమంది తమకు మాఫీ డబ్బులు పడలేదని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు.
ఐదేళ్లలో మూడు విడతల మాఫీ సొమ్మును కూడా జమచేయలేకపోయారు. ఎన్నికల ముందు రెండు విడతల మాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లోకి వేసినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని చేశారు. అది పూర్తిగా అబద్ధం అని తేలిపోయింది.
ఇప్పుడు తమ చేతగాని తనం గురించి ప్రస్తావిస్తూ, రైతు రుణమాఫీని చేయాలంలూ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడే ప్రయత్నిస్తూ ఉండటం గమనార్హం. అసెంబ్లీలో కూడా టీడీపీ ఈ డిమాండ్ చేసింది. రుణమాఫీ చేసి చూపిస్తానంటూ ఐదేళ్లపాటు అధికారాన్ని చేతిలో పెట్టుకుని దాన్ని చేయలేక ఇప్పుడు జగన్ ఆ పని చేయాలంటూ చంద్రబాబు నాయుడు వాదిస్తూ ఉండటం గమనార్హం.