దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీని నోరు మూయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుంది. అంతేకాదు, 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం కలిగిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని నోరెత్తకుండా చేయడం ఒక్క జగన్‌కే సాధ్యమైంది. బహుశా ఇలాంటి పరిస్థితి వస్తుందని సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి అయిన చంద్రబాబు ఊహించి ఉండరేమో!
కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గెజిట్ నోటిఫికేషన్లను కూడా విడుదల చేసింది. కృష్ణా జిల్లాకు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టడం విశేషం. కనీసం దీన్ని కూడా హర్షించలేని దయనీయ స్థితిలో టీడీపీ ఉంది. అంటే జగన్ ఏం చేసినా ప్రధాన ప్రతిపక్షం ఓర్వలేదనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా జిల్లాల పునర్వ్యస్థీకరణలో భాగంగా కొన్ని చోట్ల వివిధ కారణాల వల్ల అంసతృప్తగళాలు వినిపిస్తున్నాయి. ఒక జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న తమను… మరో జిల్లా కేంద్ర పరిధిలోకి తీసుకెళ్లడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఉదాహరణకు కర్నూలు జిల్లాలోని పాణ్యం, గడివేముల మండలాలను కర్నూలు జిల్లాలో కలపడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమకు కేవలం 5-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల జిల్లాలో కాదని కర్నూలులో కలపడం ఏంటనే ప్రశ్నలు స్థానికుల నుంచి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల ఉన్నాయి.
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో అధికార పార్టీ నుంచే నిరసన వ్యక్తం కావడం విశేషం. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించకపోవడంపై స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన వైసీపీ నేత కావడం గమనార్హం. రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆయన ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వైసీపీ రానున్న ఎన్నికల్లో ఓడిపోతుందని హెచ్చరించారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ టీడీపీ స్థానిక నాయకులు రాజంపేట మండలం కొత్తబోయనపల్లెలో అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
అధికార పార్టీ నాయకులే అక్కడక్కడ ప్రభుత్వానికి సూచనలో, సలహాలో ఇస్తున్నారు తప్ప, మిగిలిన ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టకపోవడం విచిత్రంగా ఉంది. ప్రధానంగా టీడీపీ పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించింది. కరవమంటే కప్పకు, విడవమంవటే పాముకు కోపం అనే చందంగా… ఒక ప్రాంతానికి మద్దతు తెలిపితే, మెజార్టీ ప్రాంతాల్లో వ్యతిరేకత అవుతుందనే భయం టీడీపీ పీడిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతానికి ప్రేక్షకపాత్రకే పరిమితమవుతోంది.
ఏపీలో జిల్లాల పునర్వ్యస్థీకరణ లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అందులోని లోపాలను వేలెత్తి చూపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరీ ఇంత పిరికిపందగా టీడీపీ ఉండడం గతంలో ఎన్నడూ లేదని అంటున్నారు. చంద్రబాబు పిరికితనాన్ని పార్టీ శ్రేణులకి కూడా అంటిస్తున్నారనే వ్యంగ్య కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం విశేషం. ఏది ఏమైనా టీడీపీ పలాయనం చిత్తగించిందని చెప్పొచ్చు.