తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అసెంబ్లీ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంపై స్పందనగా మొత్తం 12 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
రైతుల సమస్యలపై తెలుగుదేశం ప్రశ్నలకు ప్రభుత్వం స్పందించగా, దానిపై తను మాట్లాడాలంటూ చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. తెలుగుదేశం ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నకు వ్యవసాయ శాఖా మంత్రి సమాధానం ఇచ్చారు.
దానిపై మళ్లీ మాట్లాడే అవకాశం రామానాయుడుకు దక్కింది. అయితే మధ్యలో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నారు. తను మాట్లాడాలంటూ పట్టుబట్టారు. దానికి చైర్ లో ఉన్న డిప్యూటీ స్పీకర్ అనుమతి ఇవ్వలేదు.
దీంతో చంద్రబాబు నాయుడు రెచ్చిపోయారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ ఆయన తన సీట్లోంచి లేచి స్పీకర్ పోడియం ముందు భైఠాయించారు. ఆయన అక్కడ కూర్చోవడంతో మిగతా తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో కొందరు వెళ్లి ఆయనతో పాటు కూర్చున్నారు. ఎంతకూ వీరు లేకపోవడంతో.. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న వీరిని ఒక రోజు పాటు సస్పెండ్ చేసే తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది అధికార పక్షం. ఆ మేరకు చంద్రబాబు నాయుడు సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ అయ్యారు.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఇలా సస్పెండ్ కావడం కొత్త కాదు కానీ, ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నేత సభలో అలా వ్యవహరించడం మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది. సభలో బలాబలాలను బట్టి మాట్లాడే అవకాశం దక్కుతూ ఉంటుంది. తన పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడుతున్న సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు వింతగా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
నేల మీద కూర్చుని ఆయన పబ్లిసిటీ స్టంట్లు చేశారా లేక ఆయన వింతగా ప్రవర్తించారా అనే అంశంపై చర్చ జరుగుతోందిప్పుడు. అలాగే అధికార పక్షంతో వాదనకు దిగుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ను ఉద్దేశించి 'ఏం పీకుతావ్..' అంటూ గద్ధించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.