మొదటేమో శ్రీనివాస్ వద్ద రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు లభిస్తే మాత్రం తమకు సంబంధం ఏమటని తెలుగుదేశం వాళ్లు వాదించారు. ఆ తర్వాతేమో శ్రీనివాస్ దగ్గర దొరికింది రెండు లక్షల రూపాయలు మాత్రమే అని వాదించారు. అయితే ఐటీ శాఖ నోట్ లో కేవలం ఒక పేజీని మాత్రమే చూపించి తెలుగుదేశం పార్టీ వాళ్ల తమవైన తెలివి తేటలను చూపించారనే క్లారిటీ వచ్చింది. ఇదంతా ఒక వైపు సాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఈ వ్యవహారాలపై చంద్రబాబు నాయుడు స్పందించకపోవడమే అసలైన విషయంగా మారుతూ ఉంది!
అసలే తను నిప్పు అని చెప్పుకుతిరిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటిది తనపై ఇన్ని ఆరోపణలు వస్తుంటే, తన ప్రత్యర్థులు రెండు వేల కోట్ల రూపాయల స్థాయి అభాండాలు వేస్తుంటే.. చంద్రబాబు నాయుడు ఎందుకు కామ్ గా ఉన్నారు? అందులోనూ చంద్రబాబు తీరేమిటో అందరికీ తెలిసిందే. తన గురించి ఎవరైనా ఏమైనా అనుకోనే లోపు.. మీడియా ముందుకు వచ్చేస్తూ ఉంటారు. గంటల గంటల పాటు ప్రెస్ మీట్లు పెట్టి, చెప్పిందే చెబుతూ ఉండే వ్యక్తి ఆయన! అలాంటిది తన విషయంలో అంత ప్రచారం జరుగుతూ ఉంటే.. ఎలా కామ్ గా ఉన్నారు?
అందునా అక్రమాస్తులు దొరికింది మరెవరి దగ్గరో కాదు.. తన మాజీ పీఎస్ దగ్గర! అలాగే తన పార్టీ నేతలు కొందరి వద్ద భారీ స్థాయిలో ఐటీ శాఖ డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుందట. ఇలాంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం గమనార్హం. గురువారం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లిపోయారని, అక్కడ తర్జనభర్జనలు సాగుతున్నాయని వార్తలు వచ్చాయి. కనీసం సోమవారం అయినా చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నింటి మీదా స్పందిస్తారని, తన నిప్పు స్వభావాన్ని చాటుకుంటారని అంతా అనుకున్నారు. అందునా చంద్రబాబునాయుడి వీరాభిమానులు ఆ మేరకు ఆశించారు. అయితే ఆయన సోమవారం కూడా మీడియా ముందుకు రాలేదు, ప్రెస్ మీట్ కు కాల్ చేయలేదు!
మరోవైపు చంద్రబాబు స్పందననే తెలుసుకోవడానికి తాము ప్రయత్నం చేసినట్టుగా కొన్ని వార్తా సంస్థలు ప్రకటించాయి. ఆయనకు ఫోన్ చేసినట్టుగా, మెయిల్ పెట్టినట్టుగా చెప్పాయి. కానీ ఆయన నుంచి స్పందన రాలేదని ఆ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. రోజులు గడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్లేమో అసలు ఇది ఇష్యూనే కాదని వాదించారు. తర్వాత వేరే కథ బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు మాత్రం స్పందించడం లేదు. ఇంతకీ ఏమిటో కథ.. ఇంకా వ్యవహారం లోలోపల సర్దుకోలేదా?