ఎటు తిరిగీ తమకు ఉరి శిక్ష అమలును వాయిదాల పద్ధతిన అయినా ఆపాలనే ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నట్టున్నారు నిర్భయ హంతకులు. వీరికి మూడో సారి డెత్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. మార్చి రెండో తేదీన వీరికి ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీ హై కోర్టు మరోసారి ఆదేశించింది. ఇప్పటికే వీరికి ఈ మేరకు రెండు సార్లు డెత్ వారెంట్ జారీ కాగా, ఆ రెండు సార్లూ శిక్ష అమలు కాలేదు. చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటూ నిర్భయ హంతకులు శిక్ష అమలును వాయిదా వేయించుకుంటున్నారు. ఈ క్రమంలో మూడో సారి కూడా వీరి కొత్త ఎత్తుగడలతో రెడీ అయినట్టుగా సమాచారం.
అందులో భాగంగా వినయ్ గుప్తా అనే వాడు ఈ సారి రాష్ట్రపతి వద్ద పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది వరకూ రెండు సార్లూ ఈ హంతకుల్లో ఇద్దరు రాష్ట్రపతి వద్ద తమ క్షమాభిక్ష పిటిషన్ పెట్టారు. తీరా శిక్ష అమలు సమయంలో వారు పిటిషన్ పెట్టడం, శిక్ష అమలు వాయిదా పడటం జరిగింది. అమలు తేదీ దగ్గరకు వచ్చినప్పుడే వారు రాష్ట్రపతి వద్దకు పిటిషన్ పెట్టడం, ఆ పై ఆ పిటిషన్ తిరస్కరణ అయినా, మళ్లీ రాష్ట్రపతి పై కోర్టుకు వెళ్లడం వంటివి చేస్తూ ఉన్నారు. రెండు సార్లూ అదే ఎత్తుగడ వేశారు.
ఇక మూడో సారి వినయ్ గుప్తా అనే వాడు మళ్లీ పాత కథనే నడిపిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే.. మళ్లీ వీరి ఉరి శిక్ష అమలు వాయిదా పడినట్టే. అలాగే వీరిలో మరొకడు ఇంకో ఎత్తుగడ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. తనకు పిచ్చి అని, తన మానసిక స్థితి సరిగా లేదని..అందుకే తనను ఈ శిక్ష నుంచి మినహాయించాలని కోరుతూ వినయ్ శర్మ అనేవాడు కోర్టును కోరుతూ ఉన్నాడు.