గతంలో ప్రతిపక్షాలు ఏం చేసినా, ఎన్ని విమర్శలు వచ్చినా ఏవీ పట్టనట్టు ఉండే సీఎం జగన్, ఈసారి ఎందుకో సడన్ గా రియాక్ట్ అయ్యారు.
జనసేన డిజిటల్ క్యాంపెయిన్ వల్లే జగన్ రోడ్ల మరమ్మతులపై సమీక్ష నిర్వహించారని చెప్పలేం కానీ.. ఏపీలో ఉన్న రోడ్ల పరిస్థితి ఏడాదిలోగా మెరుగవ్వాలని ఆయన సమీక్షలో చెప్పడం, అదే సమయంలో మీడియాలో వస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవాలని మంత్రులకు, అధికారులకు ఉద్బోధ చేయడం చూస్తుంటే.. కచ్చితంగా జనసేన డిజిటల్ క్యాంపెయిన్ వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి.
ఏపీలో రోడ్ల దుస్థితి ఎవరూ కాదనలేని వాస్తవం, అయితే ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం కూడా దీన్ని లైట్ తీసుకుంది. గతేడాది వానాకాలంలో రోడ్లు దెబ్బతింటే.. చిన్నపాటి మరమ్మతులు చేసి సరిపెట్టారు. ఈ సారి వానాకాలానికల్లా అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. వానలు మొదలయ్యేలోగా అధికారులు, నేతలు మరమ్మతుల విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో వర్షాలకు రోడ్లు మరింత దారుణంగా తయారయ్యాయి.
అదే సమయంలో జనసేన ఈ దురవస్థను సోషల్ మీడియాలో మరింత పెద్దదిగా చూపించడం మొదలు పెట్టింది. దీంతో వెంటనే నష్టనివారణ చర్యలకు దిగింది ప్రభుత్వం. టెండర్లు రాని చోట వెంటనే పిలిపించాలని వానలు తగ్గాక పనులు మొదలు పెట్టారని ఆదేశించారు సీఎం జగన్. వచ్చే వానాకాలం నాటికి రోడ్ల పనులన్నీ పూర్తవ్వాలని చెప్పారు.
నెగెటివ్ ప్రచారంతో పాజిటివ్ ఇమేజ్..
రోడ్ల దురవస్థపై ఇప్పటి వరకైతే వైసీపీపై నెగెటివ్ ఇమేజ్ ఉంది. అయితే ఇప్పుడు రోడ్లు బాగుచేయడంతో పాటు, పనిలో పనిగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్ల పనులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు డబుల్ రోడ్లు పడితే.. ఏపీలో రవాణా స్వరూపమే మారిపోతుంది.
ఏడాదికేడాది వాహనాల సంఖ్య పెరుగుతున్నా, పెద్ద పెద్ద వాహనాలు చిన్న ఊళ్లకు పరుగులు తీస్తున్నా.. చాలా చోట్ల సింగిల్ రోడ్లు మాత్రమే కనిపిస్తుంటాయి. ఇప్పుడవన్నీ డబుల్ రోడ్లు అయితే మాత్రం కచ్చితంగా వైసీపీకి ముందు, వైసీపీ తర్వాత అని చెప్పుకోవాల్సిందే.
అంటే ఈ మార్పు వైసీపీకి మంచి మైలేజీ తెస్తుందన్న మాట. రోడ్లు బాగు కోసం ప్రతిపక్షాలు పట్టుబడితే, అద్దంలాంటి రోడ్లు వేసి ఆ మచ్చ తుడిపేయబోతున్నారు జగన్, అంతే కాదు రోడ్ల వ్యవస్థను సమూలంగా మార్చేయబోతున్నారు.
మొత్తమ్మీద, గతంలోలా కాకుండా.. నెగెటివ్ ప్రచారాన్ని కూడా పాజిటివ్ గా మార్చేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. విమర్శించినవారే తిరిగి పొగిడేలా, ప్రభుత్వానికి ప్రచారం కల్పించేలా చేయబోతున్నారు.