తెలుగుదేశం కొత్త వ్యూహం ఫలిస్తుందా!

తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహం అమలు చేయడం ద్వారా ప్రజలలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రాంతాల వారీగా చర్చా వేదికలను నిర్వహించి ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న ప్రచారానికి…

తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహం అమలు చేయడం ద్వారా ప్రజలలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రాంతాల వారీగా చర్చా వేదికలను నిర్వహించి ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న ప్రచారానికి సంకల్పించారు. ముందుగా ఉత్తరాంధ్రను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. 

విశేషం ఏమిటంటే ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో ఏవైనా చర్చా వేదికలను ఇండిపెండెంట్ సంస్థల ద్వారా లేదా,కాస్తో, కూస్తో తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులు, సంస్థల ద్వారా ఇలాంటి వేదికలు నిర్వహించేవారు. కాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తన ఆఫీస్ లోనే ఈ చర్చావేదిక నిర్వహించింది. 

వేరే సంస్థలు కాని, వ్యక్తులు కాని,టిడిపి వారు కోరుకున్నట్లు ఇలాంటి వేదికలు నిర్వహించడానికి ముందుకు రాలేదో ,ఏమో కాని టిడిపి సొంతంగానే చర్చ పెట్టుకుని ప్రచారం చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ఎపి అద్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు ఉత్తరాంద్రలో అభివృద్ది జరగడం లేదని విమర్శించారు. 

ప్రతిపక్షం అన్నాక సహజంగానే విమర్శలు చేస్తుంది. అంతవరకు అభ్యంతరం లేదు. కాని సమయం, సందర్భంతో నిమిత్తం లేకుండా టిడిపి ఈ హడావుడి చేస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు కూడా కాలేదు. అందులో పది నెలలే జగన్ సాధారణ పరిస్థితులలో పాలన చేశారు. మిగిలిన కాలం అంతా కరోనా సంక్షోభంతోనే గడిచిపోయింది. ఇప్పటికీ కరోనా సమస్య తొలగిపోలేదు. ప్రభుత్వ ఆదాయాలు పడిపోయాయి. 

ఏ రాష్ట్రంలోను పెద్ద అబివృద్ది జరిగే పరిస్థితి లేదు. అయినా జగన్ తన వంతు గట్టి కృషి చేసి అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు.కొత్త వ్యవస్థలను ప్రవేశ పెట్టారు. గ్రామాలు, పట్టణాలలో సచివాలయ వ్యవస్థను నెలకొల్పారు. తద్వారా లక్షల మందికి ఉద్యోగాలు, లేదా వలంటీర్ల పోస్టులను ఇప్పించారు. రైతు భరోసా కేంద్రాలను స్థాపించి రైతులకు అవసరమైన ఇన్ పుట్స్ అన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 

మరో వైపు స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా బడుల ఆధునీకరణ చేపట్టారు. గ్రామాలలో క్లినిక్స్ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో అమ్మ ఒడి, చేయూత, చేనేత నేస్తం, ఇలా రకరకాల సంక్షేమ కార్యక్రమాలను జగన్ అమలు చేశారు. మరి ఇది అంతా అబివృద్ది కిందకు రాదా? వెనుకబడిన తరగతులవారు అదికంగా ఉండే ఉత్తరాంద్రలో ఈ స్కీములు అన్నీ అమలు జరగడం లేదా?కరోనా టైమ్ లో ఇంత డబ్బు ప్రజలలోకి వెళ్లడం వారికి మేలు చేసిందా?లేదా?గతంలో చంద్రబాబు నాయుడు ఏమి చేశారు..అప్పట్లో ఏమని చెప్పేవారు. 

రాష్ట్రానికి ఆదాయం లేదు..అప్పుల్లో ఉంది. అయినా తాను కనుక ఆయా కార్యక్రమాలు చేపడుతున్నానని చంద్రబాబు అనేవారు.ఎక్కడ వీలైతే అక్కడ అప్పులు తెచ్చేవారు. ఆ డబ్బుతో ఉత్తరాంద్రలో ఏ ఏ అబివృద్ది కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలి కదా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటివాటిని ఎందుకు చేపట్టలేకపోయారు.ఆయా సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారు. 

కాకపోతే హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు మాత్రం విశాఖలో బస్ లో బస చేసి తాను కాబట్టి అలా చేశానని ప్రచారం చేసుకున్నారు. ఆ తుపానులో విశాఖపట్నానికి అరవైవేల కోట్ల నష్టం వచ్చిందని మొదట చెప్పారు. ఆ తర్వాత దానిని ఇరవైవేల కోట్లు చేశారు. చివరికి 14వేల కోట్లుగా మార్చారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ జరిగిన నష్టాన్ని పరిశీలించిన తర్వాత వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. అందులో 600 కోట్లు మించి ఇవ్వలేదు. దానిని బట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత నిజాయితీగా పనిచేసిందో అర్దం అవుతుంది. 

ఇక విశాఖలో టిడిపి నేతల కబ్జాల గురించి వేరే చెప్పనవసరం లేదు. అప్పట్లో టిడిపి నేతలు , ముఖ్యంగా ఆనాటి మంత్రి అయ్యన్నపాత్రుడే ఆ విషయాలన్నీ బయటపెట్టారు. అయినా చర్యలు తీసుకోలేదు. సిట్ ను వేసినా నామమాత్రమే అయింది. ఈ ప్రభుత్వం వచ్చాక టిడిపి నేతలు కాని, ఇతర భూ కబ్జాదారులు కాని చేసిన భూ ఆక్రమణలను తొలగించి , వందల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుంటే కక్ష సాధింపు అని ప్రచారం చేశారు తప్ప, భూములను టిడిపి నేతలు ఆక్రమించిన విషయం ప్రచారం కాకుండా జాగ్రత్తపడడానికి ప్రయత్నం చేశారు. 

ఇలాంటి వారు ఇప్పుడు ఉత్తరాంద్ర అభివృద్ది అంటూ ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారు. అప్పు చేస్తే అప్పు అని, లేదంటే ఏమీ జరగడం లేదని టిడిపి విమర్శలు చేస్తోంది. అక్కడితో ఆగడం లేదు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తే తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా? 

అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్న చంద్రబాబు నాయుడు నిర్ణయానికి ఉత్తరాంద్ర టిడిపి నేతలు ఎక్కువ మంది కట్టుబడడం ద్వారా వారు ఆ ప్రాంతానికి ఎంత న్యాయం చేస్తున్నట్లు అనుకోవాలి? విశాఖలో ఏ కార్యక్రమం చేపట్టినా కోర్టుల ద్వారా అన్నిటికి స్టేలు తేవడం అబివృద్ది అవుతుందా? విశాఖ నుంచి భీమిలి వరకు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రతిపాదన చేయగానే టిడిపి మీడియా ఏమి రాసిందో గుర్తుకు తెచ్చుకోండి. 

రోడ్డు కారణంగా పలువురు నిర్వాసితులు అవుతారని ప్రచారం చేసింది. విశాఖలో ప్రభుత్వపరంగా భవనాలు నిర్మించబోతే టిడిపి వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎందుకు అడ్డుపడ్డారు?ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.అక్కడితో ఆగడం లేదు.విశాఖ తీర సముద్రంలో భూకంపాలు వస్తున్నాయని ఒక టిడిపి పత్రిక ప్రజలను భయపెట్టడానికి యత్నిస్తే, విశాఖ వద్ద సముద్రమట్టం పెరిగిపోతోందని ఉన్నవి,లేనివి కలిపి మరో పత్రిక అసత్యాలను ప్రచారం చేసింది. ఇదంతా ఎవరి ప్రయోజనం కోసం?

తెలుగుదేశం వారు నిజంగా విశాఖ అభివృద్దికి కట్టుబడి ఉన్నట్లయితే వారు విశాఖలో పలానా,పలానా అభివృద్ది పనులు చేయాలని సూచించాలి. అంతేకాని అక్కడ చేస్తున్నవాటికి అడ్డుపడకూడదు. అలా చేస్తూనే వారు ధైర్యంగా ఉత్తరాంద్ర అబివృద్దిపై చర్చ పెట్టారు. తద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి విశ్వయత్నం చేస్తున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా ముఖ్యమంత్రి జగన్ దే బాద్యత అని వారు విమర్శ చేయడం మరీ విడ్డూరంగా ఉంది. 

కేంద్రంపైన, బిజెపిపైన గత ఎన్నికలకు ముందు తాచుపాములా లేచి బుసలు కొట్టిన చంద్రబాబు నాయుడు కాని, ఆ పార్టీ నేతలు కాని ఇప్పుడు జెర్రిగొడ్డుల మాదిరి జారిపోయి తుస్సు మంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఎవరి అదీనంలో ఉందో వీరికి తెలియదా? అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం తీర్మానం చేసిందా?లేదా? అంతేకాదు.

పార్లమెంటులో వాయిదా తీర్మానాలు ఇతరత్రా పద్దతుల ద్వారా విశాఖ ఉక్కు సమస్యను ప్రస్తావించడానికి వైసిపి ఎమ్.పిలు యత్నించారా?లేదా? మరి టిడిపి ఎమ్.పిలు ఎందుకు ఈ విషయంలో వైసిపికి సహకరించలేదు. పైగా ఇప్పుడు జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే బిజెపి అన్నా, కేంద్ర ప్రభుత్వం అన్నా టిడిపికి ఇంత వణుకు ఎందుకు వస్తోందో ఆశ్చర్యంగానే ఉంటుంది. 

ఎలాగైనా బిజెపిని మంచి చేసుకుని వారితో పొత్తు పెట్టుకోవాలనో, లేక తమకు సంబందించిన కేసులు రాకుండా చూసుకోవాలనో టిడిపి నేతలు తంటాలు పడుతున్నది నిజం కాదా? ఇలాంటి వారు ఉత్తరాంద్ర అబివృద్ది, రక్షణ వేదిక అంటూ చర్చలు పెట్టడం విడ్డూరమే అని చెప్పాలి. 

బహుశా టిడిపి వారు ఇక్కడితో ఆగకపోవచ్చు. ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి చర్చలు చేపట్టి ప్రజల దృష్టిని మళ్లించే యత్నం చేయవచ్చు. ప్రాంతాల వారీగా తెలుగుదేశం తలపెట్టిన ఈ వ్యూహం ఫలిస్తుందా?

Kommineni