జగన్ లో ఈ మార్పు గమనించారా..?

మొండితనం, పట్టుదల.. ఈ రెండూ జగన్ కి అలంకారమేనని చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ రెండు లక్షణాల వల్లే జగన్ సంథింగ్ స్పెషల్ గా కనిపించారు. అవే ఆయనకు అధికారం దక్కేలా కూడా…

మొండితనం, పట్టుదల.. ఈ రెండూ జగన్ కి అలంకారమేనని చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ రెండు లక్షణాల వల్లే జగన్ సంథింగ్ స్పెషల్ గా కనిపించారు. అవే ఆయనకు అధికారం దక్కేలా కూడా చేశాయి. 

ఇక అధికారంలోకి వచ్చాక కూడా ఆయన తన మొండితనాన్ని వీడకపోవడం కాస్త కంగారు కలిగించే అంశమే. కొన్ని కొన్ని విషయాల్లో మరీ ముక్కుసూటిగా వెళ్లడం కూడా సరికాదు.

ముఖ్యంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ, వాటిని పట్టించుకోకపోవడం సరైనదేమో కానీ, కనీసం పరిగణలోకి కూడా తీసుకోకపోవడం మాత్రం తప్పేనని చెప్పాలి. 

ఇన్నాళ్లూ.. ఇలా విమర్శలను, వ్యతిరేక ప్రచారాన్ని పూచిక పుల్లలాగా తీసి పడేసిన జగన్.. ఇప్పుడిప్పుడే వాటిని కన్సిడర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల వరుసగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఈ విషయాన్ని నిర్థారణ చేస్తున్నాయి.

ఇళ్ల పట్టాల పంపిణీలో పట్టు విడుపులు..

టీడీపీ వాళ్లు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారని, న్యాయస్థానాల్లో కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నారనేది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే వివాదాలు లేని చోటయినా పట్టాల పంపిణీ మొదలు పెట్టొచ్చుకదా అనేది అందరిలో ఉన్న అనుమానం. 

ఈ అనుమానాన్ని హైలెట్ చేస్తూ ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది కూడా. ఇన్నాళ్లూ.. ఈ విమర్శలను లక్ష్యపెట్టని జగన్.. ఎట్టకేలకు పట్టు సడలించారు. వివాదాలు లేని చోట ఇళ్ల పట్టాల పంపిణీ మొదలు పెట్టాలని మహూర్తం ఫిక్స్ చేశారు.

టిడ్కో ఇళ్ల వ్యవహారం..

కళ్లముందు రంగులేసిన అందమైన అపార్ట్ మెంట్లు కనిపిస్తున్నాయి, కానీ వాటిలో ఎవరూ నివాసం ఉండటంలేదు. ఏడాదిన్నరగా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. ఇటీవల కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా వాటిని వాడారే కానీ, లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందడుగు వేయలేదు. 

చంద్రబాబు బకాయిలు పెట్టారనే విషయాన్ని వైసీపీ హైలెట్ చేసినా.. కళ్లముందు కనబడుతున్న బిల్డింగ్ లు ఇవ్వకుండా ప్రభుత్వం కక్షసాధిస్తోందన్న అపవాదు మాత్రం జనాల్లోకి వెళ్లింది. ప్రతిపక్షాలు కూడా దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయి. దీంతో వీటిపై కూడా జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

త్వరలో టిడ్కో ఇళ్ల కేటాయింపు కూడా జరగబోతోందనేది అధికారిక సమాచారం. ఇళ్లపట్టాలు పంపిణీ చేసే డిసెంబర్ 25నే.. టిడ్కో ఇళ్లకు కూడా ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయబోతున్నారు.

నూతన ఇసుక పాలసీ

జగన్ తీసుకొచ్చిన ఇసుక పాలసీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిస్తుంది అనుకున్న సంస్కరణ కాస్తా.. ఊహించని విధంగా పెద్దలకు మేలు చేశాయి. ఇసుక రేటు భారీగా పెరిగిపోవడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగాయి. 

చాన్నాళ్లపాటు విమర్శలను కాచుకున్నా కూడా చివరకు కొత్త పాలసీకి జగన్ సిద్ధపడ్డారు. కేంద్ర సంస్థలు సుముఖత చూపే అవకాశం కనిపించకపోవడంతో ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించి, ఇసుక రేటు గణనీయంగా తగ్గించే చర్యలు చేపట్టారు జగన్.

మద్యం ధరల తగ్గింపు..

సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చిన జగన్.. తాను అధికారంలోకి రాగానే మద్యం పాలసీని మార్చారు. టైమింగ్స్ పెట్టారు, రేట్లు పెంచారు, బ్లాండ్లు అందుబాటులో లేకుండా చేశారు. ఇలా చేస్తే ఎక్కువ రేటు పెట్టి చెత్త బ్రాండ్లు తాగలేక, మందుబాబులు ఆ వ్యసనానికి దూరమవుతారనేది జగన్ ప్రభుత్వం ఆలోచన. కానీ క్షేత్ర స్థాయిలో ఫలితం వేరేలా కనిపించింది. 

వ్యసనానికి బానిసైన వారు ఎంత డబ్బయినా ఖర్చు చేసేందుకు వెనకాడ్డంలేదు. దీంతో పేద కుటుంబాలు, మరింత దారుణ స్థితిలోకి దిగజారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం ధరలు తగ్గించి మద్యపాన నిషేధానికి మరో ప్రణాళిక అమలు చేస్తున్నారు జగన్.

రాజీలేని విధంగా విద్యాకానుక నాణ్యత..

జగనన్న విద్యాకానుకను రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది విద్యార్థులకు ప్రభుత్వం అందించింది. అలాంటి పథకాల్లో చిన్న చిన్న లోపాలు సహజంగా జరుగుతూనే ఉంటాయి. బ్యాగ్ ల జిప్ లు పోయాయని, షూ లేస్ ఊడిపోయాయని.. ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని కూడా జగన్ పరిగణలోకి తీసుకున్నారు. విద్యాకానుక వస్తువుల నాణ్యత పరిశీలించాలని, ఫిర్యాదులుంటే వస్తువుల్ని రీప్లేస్ చేయాలని కలెక్టర్లకు సూచించారు జగన్.

అంటే.. నవరత్నాల హామీలను పగడ్బందీగా అమలు చేయడంతోపాటు.. వాటిపై ఆరోపణ అనే మరక లేకుండా చూడాలనేది జగన్ ఆలోచన. అందుకే ఇటీవల కాలంలో కాస్త పట్టు విడుపులు ప్రదర్శిస్తూ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు జగన్. 

నిమ్మ‌గ‌డ్డ అఖ‌రి ఆశ…ఇక గ‌వ‌ర్న‌ర్ పైనే భారం