అన్నయ్యపై జనసైనికుల ఆశలు గల్లంతు..?

చిరంజీవి ఈరోజు కాకపోతే రేపు రాజకీయాల్లోకి వస్తారని, జనసేనకు సపోర్ట్ చేస్తారని ఆమధ్య హడావిడి చేశారు నాదెండ్ల మనోహర్. కార్యకర్తలు ఉత్సాహ పడుతుండే సరికి.. ఆయన మరింతగా రెచ్చిపోయి చిరు పొలిటికల్ రీఎంట్రీని కన్ఫామ్…

చిరంజీవి ఈరోజు కాకపోతే రేపు రాజకీయాల్లోకి వస్తారని, జనసేనకు సపోర్ట్ చేస్తారని ఆమధ్య హడావిడి చేశారు నాదెండ్ల మనోహర్. కార్యకర్తలు ఉత్సాహ పడుతుండే సరికి.. ఆయన మరింతగా రెచ్చిపోయి చిరు పొలిటికల్ రీఎంట్రీని కన్ఫామ్ చేసినంత పని చేశారు. చిరంజీవి ఆశీస్సులతోటే పవన్ సినిమాలు చేస్తున్నారని, సరైన టైమ్ లో మెగా బ్రదర్స్ ఇద్దరూ రాష్ట్ర రాజకీయాలను మారుస్తారని కూడా సెలవిచ్చారు.

ఆ తర్వాత మీడియా, సోషల్ మీడియా మరింత రెచ్చిపోవడంతో సహజంగానే జనసైనికుల్లో చిరు రీ ఎంట్రీపై ఓ నమ్మకం ఏర్పడింది. అన్నదమ్ములిద్దరూ ఒకటేనని, చిరంజీవి వస్తే, జనసేనకు మరింత సపోర్ట్ ఉంటుందని భావించారు. కానీ చిరంజీవి వరస చూస్తుంటే మాత్రం ఆయన జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

గతంలో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యల సందర్భంలో.. దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలు స్పందించారు కానీ చిరంజీవి మాత్రం తన మనసులో మాట బయటపెట్టలేదు. తాను పవన్ కల్యాణ్ తో కలసి నడుస్తానని చెప్పలేదు, జనసేనకు తనకు సంబంధం లేదని కూడా ప్రకటించలేదు. సందర్భం కోసం వేచి చూశారంతే. కానీ అలా సందర్భం వచ్చిన ప్రతిసారి జగన్ ను పొగడ్డానికే ప్రాధాన్యం ఇస్తున్నారు చిరంజీవి.

తాజాగా సినిమా థియేటర్లకు కరెంటు చార్జీల రాయితీ ప్రకటించిన నేపథ్యంలో సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు చిరంజీవి. గతంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా చిరంజీవి ఇలాగే మెచ్చుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను మూడు ముక్కలాటగా, అమరావతికి జరుగుతున్న అన్యాయంగా తమ్ముడు పవన్ కల్యాణ్ అభివర్ణిస్తే.. అభివృద్ధికి ఆలంబనగా చిరంజీవి పూర్తి వ్యతిరేక స్టేట్ మెంట్ ఇచ్చారు.

అప్పట్లోనే తను ఎటువైపు ఉంటాననే విషయంపై అభిమానులు ఓ క్లారిటీకి ఇచ్చారు చిరు. కానీ ఇటీవల నాదెండ్ల రచ్చతో మరోసారి జనసైనికుల్లో ఆశలు చిగురించాయి. అన్నయ్య ఎప్పటికైనా పవన్ తో కలసి వస్తారని జనసైనికులు ఎదురు చూస్తుంటే.. చిరు మాత్రం రోజు రోజుకీ జగన్ కి దగ్గరయ్యేలా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

ఇప్పటికైనా అన్నయ్యపై జనసైనికులు ఆశలు వదిలేసుకోవడం మంచిది, అన్నయ్య వస్తారంటూ జనసైనికుల్లో ఆశలు రేకెత్తించే తప్పుడు ప్రకటనలు చేయడం నాదెండ్ల లాంటి నాయకులు మానేస్తే మరీ మంచిది.