ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికా బద్ధంగా ముందుకు పోతున్నారని ఆయన పేర్కొన్నారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని చిరంజీవి పేర్కొన్నారు.
ఇటీవల మహిళలకు అండగా దేశంలోనే మొట్టమొదటిసారిగా జగన్ సర్కార్ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ సందర్భంలో కూడా జగన్ సర్కార్‌ను చిరంజీవి అభినందించారు. మహిళల సంరక్షణ కోసం విప్లవాత్మకమైన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకురావడం ప్రశంసనీయమని జగన్‌ను చిరంజీవి పొగడ్తలతో ముంచెత్తారు.
రెండునెలల క్రితం జగన్ ఇంటికి భార్యతో సహా చిరంజీవి వెళ్లిన విషయం తెలిసిందే. చిరంజీవి దంపతులను జగన్ దంపతులు సాదరంగా ఆహ్వానించి అతిథ్యం ఇచ్చారు. జగన్ సర్కార్ తీసుకుంటున్న ప్రతి మంచి నిర్ణయాన్ని చిరంజీవి ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటును చిరంజీవి సోదరుడు, జనసేనాని పవన్‌కల్యాణ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని రైతులకు మద్దతుగా పవన్ తన సోదరుడు నాగబాబు, మరోనేత నాదెండ్ల మనోహర్‌ను అక్కడికి పంపారు. జగన్ సర్కార్ నిర్ణయాన్ని వారిద్దరూ తప్పు పట్టారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు చిరంజీవి మద్దతు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకొంది. టీవీ చానళ్లలో హాట్ టాఫిక్‌గా నిలుస్తోంది.