మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెస్తే, దానికి మెగాస్టార్ చిరంజీవి ‘సై’ అన్నారు. ఆ మధ్య చిరంజీవి పేరుతో ఓ లెటర్ మీడియాలో ఈ మేరకు హల్చల్ చేసింది. అది ఫేక్ లెటర్.. అంటూ రచ్చ జరిగితే, చివరికి అది ‘రైట్’ లెటరేనని చిరంజీవి ఇంకోసారి స్పష్టం చేసేశారు. తాజాగా, చిరంజీవి మూడు రాజధానుల విషయమై చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయమని సాక్షాత్తూ చిరంజీవి సోదరుడు నాగబాబు ప్రకటించడం గమనార్హం.
అన్నయ్యేమో మూడు రాజధానులకు ‘సై’ అంటారు.. తమ్ముళ్ళు నాగబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం ‘నై’ అంటున్నారు. జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్సభకు పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు ‘మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దు’ అని నినదించడమే కాదు, అమరావతికి వెళ్ళి రైతులకు బాసటగా నిలబడ్డారు కూడా.
చిరంజీవిది వ్యక్తిగత అభిప్రాయమైతే, చిరంజీవి అభిప్రాయాన్ని ఖండిస్తూ.. ఆయన్ని నిలదీసేందుకు ప్రయత్నించిన అశ్వనీదత్ని మాత్రం ఎలా తప్పు పట్టగలం.? అది ఆయన అభిప్రాయం.. కానీ, నాగబాబు, అశ్వనీదత్పై ఎడా పెడా విమర్శలు చేసేశారు. అశ్వనీదత్ అంటే, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడాయె. కాగా, అన్నయ్య ఇంటి ముందు ధర్నాలు చేయాలనుకుంటే, దానికి గట్టిగా రిటార్ట్ ఇచ్చి తీరతామని కూడా నాగబాబు హెచ్చరించేస్తున్నారు.
అన్నట్టు, పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి తన రాజకీయ ఆలోచనల్ని త్యాగం చేసేశారంటూ పెద్ద బాంబే పేల్చారు నాగబాబు. రాజ్యసభ సభ్యత్వం కోసం చిరంజీవి ఆలోచనే చేయడంలేదన్నది నాగబాబు చేసిన ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య. వీటన్నిటికీ తోడు, నాగబాబు సోషల్ మీడియా వేదికగా ‘భక్తులపై’ చేసిన వెటకారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ప్రభుత్వమేమో జనం ఎక్కువగా గుమికూడే ప్రాంతాలకు వెళ్ళద్దంటోందనీ, కానీ దేవుడి మీద భక్తి వున్నవారు.. ప్రార్థనాలయాలకి వెళ్ళి ప్రేయర్స్ చేసుకోవాలనీ, ప్రసాదం తినాలనీ.. ఏమీ జరగకపోతే దేవుడు గొప్ప అనీ.. తేడా కొడితే కరోనా గొప్ప అనీ నాగబాబు ట్వీటేశారు. దాంతో, నాగబాబుపై ఎడా పెడా విమర్శలతో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.