మెగాస్టార్ చిరంజీవి తాజా ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. ఒకే ఒక్క ట్వీట్‌తో రెండు రకాల సందేశాల్ని ఆయన జనంలోకి పంపారు. ఒకటేమో తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు, రెండోది జగన్ సర్కార్‌పై పరోక్షంగా దెప్పి పొడుపనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజు గారి పెద్ద భార్య మంచిదంటే, మరి చిన్న భార్య సంగతేంటనే అర్థంలో… చిరు ట్వీట్ కూడా ఉందని రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సినిమా టికెట్ల ధరల విషయమై ఆంధ్రప్రదేశ్‌లో వివాదం నడుస్తోంది. మరోవైపు తెలంగాణలో ధరలను పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సినీ పరిశ్రమ నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. జగన్ ప్రభుత్వంపై మాత్రం సినీ పరిశ్రమ గుర్రుగా ఉంది. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై సినీ పరిశ్రమ అసంతృప్తి, అసహనాన్ని మెగాస్టార్ చిరంజీవి తాజా ట్వీట్ ప్రతిబింబిస్తోంది. అయితే ఇందులో ఎక్కడా జగన్ ప్రభుత్వమనే మాటే ప్రస్తావించకపోయినా, పరోక్షంగా పరిశ్రమ మూడ్‌ని వ్యక్తపరిచారని చెప్పొచ్చు.
‘తెలుగు చిత్రపరిశ్రమ కోరికను మన్నించి.. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యం, అన్ని వర్గాలవారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ ధరలను సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్థం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పరిశ్రమ బాగు కోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని చిరు పేర్కొన్నారు.
సినిమా టికెట్ల ధరల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్వీట్‌లోని ప్రతి వాక్యాన్ని జగన్ ప్రభుత్వ విషయంలో వ్యతిరేకంగా అర్థం చేసుకోవాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.