సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆయన చెప్పిన వాటిలో కొన్ని కీలక అంశాలున్నాయి. ప్రతి పోలీసు, పాలకులు భుజాలు తడుముకునేలా ఉన్నాయి. ఉచిత న్యాయసేవలకు సంబంధించి జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ మొబైల్ యాప్, వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ సభలోసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక ఉపన్యాసం చేశారు.
‘మానవ హక్కులు, మర్యాద అనేవి సర్వోన్నతమైనవి. అయితే వాటికి పోలీసు స్టేషన్లలోనే అత్యధిక ముప్పు ఏర్పడుతోంది. కస్టడీలో పోలీసుల అకృత్యాలు, చిత్రహింసలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రాజ్యాంగపరమైన నిర్దేశాలు, హామీలు ఉన్నప్పటికీ పోలీసుస్టేషన్లలో న్యాయపరమైన ప్రాతినిధ్యం లేకపోవడం.. అరెస్టు అయిన వారికి గొడ్డలిపెట్టుగా మారుతోంది. ఇటీవల వచ్చిన కథనాలను బట్టిచూస్తే విశేషాధికారాలున్న వారు కూడా థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్‌కు అతీతులుకారని వెల్లడైంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విశేషాధికారాలున్న వారు కూడా థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్‌కు అతీతులు కారనే జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్య చదివితే, వింటే …మీలో ఎవరికైనా, ఎవరైనా గుర్తు వస్తున్నారా? అంటే తనపై సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ డిగ్రీ ప్రయోగించారని కోర్టులకెక్కడం, మిల్టరీ ఆస్పత్రి, ఢిల్లీ ఎయిమ్స్ తదితర ప్రముఖ వైద్య సంస్థల్లో ట్రీట్‌మెంట్ తీసుకోవడం గురించి పత్రికల్లో కథనాలు చదివిన జ్ఞాపకం ఏమైనా వస్తోందా?
అలాగే అత్యున్నత చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న తనపై లాఠీలతో చావబాదారని, కాళ్లకు గాయాలయ్యాయని దేశంలోని ఎంపీలందరికీ లేఖలు రాయడం, రాజ్యాంగ వ్యవస్థల్లోని ముఖ్యులకు మొర పెట్టుకోవడం గురించి ఏమైనా గుర్తుకొస్తున్నాయా? అలాంటిది ఏమైనా ఉంటే, ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండబ్బా…ఫ్లీజ్!