నీరజ్ చోప్రా…ఇది ఇప్పుడు దేశంలో మారుమోగుతున్న పేరు. బల్లెం విసిరి టోక్యో ఒలింపిక్సులో భారతదేశానికి స్వర్ణపతకం తీసుకొచ్చిన క్రీడాకారుడు.
సోషల్ మీడియాలో అతని గురించి దంచేస్తున్నారు. అధికశాతం పోస్టులని బట్టి అర్థమౌతున్నదేమిటంటే మన యువత అతని మీద బయోపిక్కొస్తే చూడాలనుకుంటున్నారు. ఏ హీరో అయితే అతని పాత్రకి సరిపోతాడో కూడా చర్చించుకుంటున్నారు. కొందరైతే అతనికి ఏ ప్రభుత్వం ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తోందో లెక్కలేసుకుని చప్పట్లు కొట్టుకుంటున్నారు. అంతే తప్ప ఒక్కరు కూడా అతనిలాగ స్పోర్ట్స్ మన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పట్లేదు.
“కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు..” అని ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ పాట రాసాడు. ఆ సందర్భం ఏదైనా ప్రస్తుతం ఒలింపిక్సులో మనవాళ్ల పరిస్థితి చూస్తుంటే ఆ లైన్ గుర్తొస్తుంది. కానీ లోతుల్లోకి వెళితే వాళ్లని వృద్ధులుగా మార్చడంలో తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వం అన్నీ కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పక తప్పదు.
అమెరికాలో 15 నుంచి 24 ఏళ్ల వయసున్నవాళ్లు 3 కోట్ల 75 లక్షలమంది. అదే చైనాలో 17 కోట్లమంది. జపాన్ లో అయితే కేవలం 1 కోటి 13 లక్షల మంది. ఈ మూడు దేశాల గురించే ఎందుకు చెప్పుకుంటున్నమంటే ఇవే అత్యధిక మెడల్స్ ని గెలుచుకుని తొలి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు. అమెరికా 113 మెడల్స్, చైనా 88, జపాన్ 58 గెలుచుకున్నాయి. 7 మెడల్స్ గెలుచుకున్న ఇండియా నీరజ్ తెచ్చిన స్వర్ణం పుణ్యమా అని 48 వ స్థానంలో ఉంది.
మరి 15-24 ఏళ్ల జనాభా మన దేశంలో ఎంతమందో తెలుసా? ఏకంగా 25 కోట్లమంది. అంతమందిలోంచి ఒలింపిక్సులో సత్తా చాటిన వాళ్లు కనీసం రెండంకెల్లో కూడా లేరు.
దీనికి కారణాలు అనేకం.
మన దేశంలో క్రీడాస్ఫూర్తి మొదటి నుంచీ తక్కువే. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంజనీర్లుగానో, డాక్టర్లగానో చూడాలనుకుంటారు తప్ప ఆటగాళ్లగా రాణించాలని కోరుకోరు. ఎందుకంటే తమ ఇరుగుపొరుగు పిల్లలు, చుట్టాల పిలల్లు ఎలా సెటిలవుతున్నారో అదే మార్గంలో వెళ్లాలనుకునే ఆలోచన తప్ప భిన్నంగా ఆలోచించే ధైర్యం చేయరు.
“అలా అంటారేవిటి? మా పిల్లల్లో ఆ ట్యాలెంటో, కోరికో ఉంటే ఆ దిశగా ప్రోత్సహించమా?” అనొచ్చు. అదీ నిజమే. కాస్త భిన్నంగా ఆలోచించమంటే సినిమా యాక్టరవుతాననే యువత ఉంది తప్ప స్పోర్ట్స్ లో రాణించాలనుకునేవాళ్లు తక్కువ. ఒకవేళ ఆటల్లో కాళ్లో, వేళ్లో పెట్టినా స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వోద్యోగం పొందడానికే లైన్లో ఎక్కువమందున్నారు తప్ప కసిగా ఇంటర్నేషనల్ గేం ఆడాలనుకునేవాళ్లు తక్కువ.
“అదేంటండీ..ప్రభుత్వం ప్రోత్సహిస్తే మేం మాత్రం స్పోర్ట్స్ మీద ఫోకస్ పెట్టమా? మన దగ్గర అమెరికా, చైనా టైపులో క్వాలిటీ కోచింగుల్లేవు. వసతుల్లేవు. పైగా క్రికెట్ బోర్డు నుంచి అన్ని చోట్లా ఏవో పాలిటిక్స్…ఇంతా చేసి క్రికెట్టుకి తప్ప మన దేశంలో వేరే ఆటలకి గ్లామర్ లేదు…మమ్మల్ని ఎట్రాక్ట్ చేయండి. మేమొస్తాం” అని యువత అనొచ్చు.
అది కూడా అక్షరాలా నిజం.
2016లో రాజ్య సభ మెంబరైన బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోం క్రీడాశాఖామంత్రికి పార్లమెంటులో ఒక బాధ చెప్పుకుంది..”మా క్రీడాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా విభాగాల్లోనూ సరైన కోచింగ్ ఉండట్లేదు. సదుపాయాలుండట్లేదు. పోటీలు జరుగుతున్నప్పుడు తప్ప క్రీడాకారులకి పెట్టాల్సిన ఆహారం పెట్టట్లేదు. దయ చేసి పెట్టాల్సిన సరైన ఫుడ్ పెట్టండి. బజెట్ ని కేటాయించండి” అని అడిగిందామె.
దానికి క్రీడామంత్రిగారు లేచి నిలబడి, “బజెట్ కెటాయించాలంటే ఫండ్ కావాలి. అది మూడు మార్గాల ద్వారా వస్తుంది. ఒకటి – ఆర్ధికశాఖ కేటాయింపు, రెండు- వివిధ కంపెనీల సామాజిక బాధ్యత ద్వారా, మూడు ఎన్నారైలు దయతలచి నేషనల్ స్పోర్ట్స్ ఫండ్ కి ఏదైనా పంపిస్తే…ఆ ప్రయత్నాలు చేద్దాం” అని చెప్పాడు. ఇదీ పరిస్థితి.
బాటం లైన్ ఏంటంటే, ఆవిడ క్రీడాకారులకి సరైన తిండి పెట్టమని అడిగింది…దానికి మంత్రిగారు మూడిళ్లల్లో అడుక్కుని పెట్టే ప్రయత్నం చెద్దాం అన్నారు.
ఈ దుస్థితిలో ఉంది మన వ్యవస్థ. డబ్బుల్లేకపోవడం కాదు..శ్రద్ధ లేకపోవడమే. ఇన్నిన్ని పథకాలకి డబ్బులెక్కడినుంచి వస్తున్నాయి? సర్దార్ పటేల్ విగ్రహం పెట్టడానికి ఎక్కడినుంచి వచ్చాయి? మన దేశం ఒలింపిక్సులో స్వర్ణాలు గెలవాలి అని సంకల్పించి అన్ని ఏర్పాట్లు చేసి, యువతని ఆకట్టుకుని, పదేళ్లు తపస్సు చేస్తే మనకున్న యువజనాభాకి ఒలింపిక్సులో టాప్ 5 లిస్టులోకి చేరే పరిస్థితి రావొచ్చు. కానీ మన రాజకీయ, సామాజిక వ్యవస్థ ప్రస్తుతానికి ఆ ధ్యాసలో లేదు.
ఇక ఏసియన్ లో అయినా, ఒలింపిక్సులో అయినా మెడల్ కొట్టుకొస్తే మన దేశం ఆ క్రీడాకారులకి ఉద్యోగాలిస్తుంది.
పీవీ సింధు జాయింట్ కలెక్టర్ అయ్యింది. ఆమె స్పోర్ట్స్ లో రిటైర్ అయ్యాక ఆ ఉద్యోగం చేసుకోవచ్చు..కలెక్టర్ కూడా అవ్వొచ్చు.
అథ్లెట్ హిమా దాస్ అస్సాం రాష్ట్రంలో డీ.ఎస్.పీ అయ్యింది. ఆమె కూడా మరొక పది పదిహేనేళ్ల తర్వాత వెళ్లి ఆ ఉద్యోగం చేసుకోవచ్చు..ఎస్పీ కూడా అవ్వొచ్చు.
రేపు నీరజ్ చోప్రాకి కూడా ఏదో ఒక పెద్ద ఉద్యోగం ఇస్తారు. స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యాక లైఫ్ సెటిలైపోయినట్టే.
అలాగే మిగిలిన క్రీడాకారులకి కూడా. వీరిలో పైన చెప్పుకున్న అనేకమైన కష్టాల్ని అధిగమించి ఒలింపిక్స్ వరకు రాణించిన వారు కొందరు. డబ్బుండి అంతర్జాతీయ స్థాయి కోచింగ్ తీసుకుని, సొంత డైట్ ప్లాన్ చేసుకుని పైకొచ్చినవారు కొందరు.
మన యువతలో క్రీడాకారులుగా ఎదగగలిగిన వారు ఎందరో ఉన్నారు. వ్యవస్థల్లోనూ, మన మెదళ్లల్లోనూ ఎన్నో విధాలైన ప్రక్షాళనలు జరిగితే తప్ప మన కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు కాదు…మా “యువకులు ముందుయుగం దూతలు- భావన నవజీవన బృందావన నిర్మాతలు..” అని శ్రీ శ్రీ పంక్తుల్ని ప్రపంచానికి వినిపించవచ్చు.
– గ్రేట్ ఆంధ్రా బ్యూరో