అమరావతిలోనే పరిపాలన రాజధాని కొనసాగించాలని నినదిస్తూ కొందరు చేస్తున్న ఆందోళన నిన్నటికి 600వ రోజుకు చేరిన సందర్భంగా …అందరూ ఊహించినట్టే ఓ సీన్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జగన్ ప్రభుత్వ వ్యతిరేక మీడియా దాన్ని భూతద్దంలో చూపింది. ఈనాడులో ‘నిర్బంధకాండ’, ఆంధ్రజ్యోతిలో ‘రాజధాని రైతులపై దాష్టీకం’ శీర్షికలతో బ్యానర్ కథనాలను ప్రచురించారు. ప్రభుత్వ అణచివేత చర్యలను తిప్పికొడుతూ , ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ గొంతుకకు మీడియా అండగా నిలబడడాన్ని అందరూ స్వాగతించాల్సిందే.
ఇదే సమయంలో అన్నిటికి మించి ప్రతిపక్షాల అవకాశవాద రాజకీయాలను ఆవిష్కరించడంలో ఉద్దేశ పూర్వక విస్మరణను ప్రశ్నించకుండా ఉండలేని పరిస్థితి. అసలు అమరావతి ఆందోళనకారుల కష్టనష్టాలకు ప్రధాన కారణం చంద్రబాబే అనేది జగమెరిగిన సత్యం. ఎల్లో మీడియా రాతల ప్రకారం అమరావతి ఆందోళనకారులపై జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధకాండను ప్రదర్శించిందని అనుకుందాం. ప్రభుత్వ అణచివేత చర్యల గురించి ఈనాడు రాతల్లో చెప్పాలంటే….
‘అడుగడుగునా బారికేడ్లు.. దారి పొడవునా ఇనుప కంచెలు.. ప్రతి పల్లెలోనూ వందల మంది పోలీసులతో కవాతులు..ఇంటి నుంచి కాలు బయటకు పెట్టటమే నేరమన్నట్లుగా తీవ్ర స్థాయి అణచివేతలు.. ఊరు దాటి ముందుకెళ్లనీయకుండా నిర్బంధాలు.. ఈ దమనకాండ దృశ్యాలు, చిత్రాలను ఏవీ తీయకుండా, చూపించకుండా.. ఎక్కడికక్కడ మీడియాపై ఉక్కుపాదం మోపుతూ చర్యలు… ఇలా రాజధాని అమరావతి ఉద్యమం ఆదివారం నాటికి 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా తలపెట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానానికి’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చేయని ప్రయత్నమంటూ లేదు’ అని రాసుకొచ్చారు.
మహిళలు, వృద్ధులు, పిల్లలు రోడ్లపైకి వచ్చి పోలీసులతో తన్నులు తింటుంటే, తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటుంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు ఏం చేశారనే ప్రశ్న కలగకుండా ఉండదు. టీడీపీ ముఖ్య నేతలంతా ఈ వ్యవహారాన్ని కళ్లప్పగించి సినిమా చూస్తున్నట్టు చూస్తూ వుండిపోయారు. అంతే తప్ప, వారికి మద్దతుగా క్షేత్రస్థాయిలో పోరాటం ఎందుకు చేయలేదనే ప్రశ్నలు, విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
అమరావతి రాజకీయ ప్రయోజనాలు మాత్రం కావాలి, వారి పోరాటంలో మాత్రం భాగస్వామ్యం వద్దనే రీతిలో నిన్నటి టీడీపీ అవకాశవాద, స్వార్థపూరిత నైజం ఆంధ్రప్రదేశ్ సమాజానికి బాగా తెలిసొచ్చింది. ఏ దిక్కూలేని వారిగా మహిళలు, వృద్ధులు, పిల్లలంతా రోడ్లపై నానా అగచాట్లు పడుతుంతే చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు తదితర టీడీపీ నేతలకు ప్రేక్షకపాత్ర పోషించడానికి మనసు ఎలా వచ్చిందనే ప్రశ్న అన్ని వైపుల నుంచి వస్తోంది.
తగదునమ్మానంటూ… అమరావతి ఉద్యమం చరిత్రాత్మకం అని నిన్న చంద్రబాబు ఒక ప్రకటనతో సరిపెట్టారు. అలాగే అమరావతి ఆందోళనకారులపై ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల్ని తప్పు పడుతూ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటన, ట్వీట్లతో తమ బాధ్యత నెరవేరిందని చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది.
‘ప్రజా పోరాటాన్ని లాఠీలతో అణచి వేయాలని ప్రభుత్వం చూస్తోంది. త్వరలో ప్రజలు వైకాపాని అణచివేస్తారన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలి. రాజధాని గ్రామాలు పాకిస్థాన్ సరిహద్దును తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని సగం మంది పోలీసులు అమరావతిలోనే ఉన్నారు. మహిళలనూ రోడ్లపై ఈడ్చుకెళ్లారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రోడ్లనూ తవ్వేస్తూ అమరావతిని చంపేశామని సీఎం జగన్ ఆనందపడుతున్నారు. ఆ గుంతల్లోనే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ అంటూ శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అయినా ప్రజా రాజధాని పరిరక్షణ పోరాటాన్ని మహోద్యమంగా మార్చారు. అమరావతి పేరు వింటేనే సీఎం జగన్ వణికిపోతున్నారు’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇలా వుంది టీడీపీ నేతల వైఖరి. ప్రకటనలు, ట్వీట్లతో ప్రభుత్వం దిగి వస్తుందా? అమరావతిలోనే పరిపాలన రాజధాని కొనసాగాలంటే ….అక్కడ ఆందోళన చేస్తున్న వారితో కలిసి అడుగులో అడుగు వేస్తూ, పిడికిలి బిగించి పోరాటం చేయడం మాని, మీడియాలో ప్రచారానికి పరిమితం కావడం కంటే దుర్మార్గం ఏదైనా ఉందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ చర్యలు నిర్బంధకాండ, దాష్టీకంగా కనిపిస్తున్న వాళ్లకి, ప్రధాన ప్రతిపక్షంగా వాటిపై పోరాటం చేయని పార్టీ పోకడలను ఏమనాలి?