బీజేపీ-జనసేన విడాకులు.. అదే తొలి అడుగు?

బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సమయంలో పవన్ కల్యాణ్ బాగానే కోతలు కోశారు. ఇకపై బీజేపీ, జనసేన పార్టీల జెండాలు మాత్రమే వేరని, కార్యక్రమాలు ఒకటేనంటూ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే ఏడాది కాపురంలోనే అనేక…

బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సమయంలో పవన్ కల్యాణ్ బాగానే కోతలు కోశారు. ఇకపై బీజేపీ, జనసేన పార్టీల జెండాలు మాత్రమే వేరని, కార్యక్రమాలు ఒకటేనంటూ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే ఏడాది కాపురంలోనే అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. తొలినాళ్లలో బీజేపీని పవన్ బాగా మోసేవారు, పవన్ కి కూడా బీజేపీ అధినాయకత్వం ఎక్కడలేని ప్రయారిటీ ఇచ్చేది.

ఇక రాష్ట్రంలో కూడా కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంయుక్త సమావేశాలు చాలానే జరిగాయి. వాటి ఫలితం ఏంటన్న విషయం పక్కనపెడితే.. రెండు పార్టీల నాయకులు కలసి ఒకేచోటే, ఒకే వేదికపై కనిపించేవారు. ఇటు కార్యకర్తల్లో కూడా ఒక రకమైన కలివిడి భావం ఉండేది.

అదంతా గతం. ఇప్పుడు క్రమక్రమంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండిపోయారు. సోము వీర్రాజు ఎంట్రీతో పరిస్థితి మరింత మెరుగవుతుంది అనుకుంటే.. మొదటికే మోసం వచ్చింది. పవన్ కల్యాణ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. చీటికీమాటికీ కేంద్ర నాయకత్వం పేరు పలవరిస్తున్నారు కానీ, రాష్ట్ర నాయకుల్ని ఆయన పలకరించిన పాపాన పోలేదు.

గ్రేటర్ ఎన్నికల సమయంలో కూడా పంతానికి పోయి అభ్యర్థుల్ని ప్రకటించాలనుకున్న పవన్, చివరకు దాన్ని కమ్యూనికేష‌న్ గ్యాప్ గా చెప్పుకొచ్చారు. తమ మధ్య ఏర్పడిన పొరపొచ్చాలకు “విస్తృత ప్రయోజనాలు” అనే ముసుగేశారు.

ఇటు తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారంలో కూడా బీజేపీ, జనసేన తెగేదాకా లాగేలా కనిపిస్తున్నాయి. రెండు పార్టీలు బరిలో దిగాలని చూస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ ఉంటే.. రాష్ట్రంలో తన సత్తా చూపాలని జనసేనాని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో బైపోల్ టికెట్ విషయం రెండు పార్టీల మధ్య మరింత గ్యాప్ పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటు నిరసన కార్యక్రమాలు కూడా విడివిడిగానే చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రోడ్ల సమస్యలపై ఇటీవల బీజేపీ నిరసన కార్యక్రమాలు చేసింది, దీనికి జనసేనకు కబురందలేదు. ఇక రైతుల సమస్య అంటూ జనసేన నాయకులు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపట్టారు. ఇందులో బీజేపీకి ఎంట్రీ లేదు. ఇలా ఎవరికి వారే తమ ఉనికి చాటుకోడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

కలసి పనిచేస్తాం, కలసి అధికారంలోకి వస్తాం, ప్రస్తుతానికి టీడీపీకి ప్రత్యామ్నాయం మేమే.. వచ్చే ఎన్నికలనాటికి వైసీపీకి కూడా ప్రత్యామ్నాయం మేమేనని చెబుతున్నారే కానీ.. చేతల్లో మాత్రం “మేము” అనే కాన్సెప్ట్ ఎక్కడా కనిపించడంలేదు.

పొత్తు అనేది పేరుకే కానీ, పార్టీల మధ్య నిజంగా లేదు అనే చెప్పాలి. తిరుపతి ఉప ఎన్నికల టికెట్ పై పీటముడి పడితే… బీజేపీ, జనసేన విడాకులకు అదే తొలి అడుగు అవుతుంది.

పవర్ స్టార్ పేరెత్తగానే