కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో అధికారిక కార్యక్రమాలను చాలా వరకూ వర్చువల్ పద్ధతిలోనే నిర్వహించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సెకెండ్ వేవ్ ప్రారంభమైన సమయంలో జరిగిన తిరుపతి లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారాన్ని కూడా అప్పట్లో జగన్ రద్దు చేసుకున్నారు.
ప్రతిపక్ష పార్టీలు తిరుపతి బై పోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశాయి. అంతకు ముందు ఏడాదిగా జనం మధ్యకు పెద్దగా రాని చంద్రబాబు నాయుడు ఏకంగా వారానికి పైనే తిరుపతి బై పోల్ ప్రచారాన్ని చేసుకున్నారు. వీధివీధి ప్రచారం చేసినంత పని చేశారు. అలాగే పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కూడా ప్రచారాన్ని హోరెత్తించారు.
బీజేపీ నేతలు నెలల తరబడి తిరుపతి లో మకాం పెట్టారు. చివరకు డిపాజిటివ్ కోల్పోయారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తిరుపతి నియోజకవర్గం పరిధిలో ప్రచారానికి అయితే రెడీ అయ్యారు. ఒకటీ రెండు రోజుల పాటు నియోజకవర్గం వ్యాప్తంగా సుడిగాలి పర్యటన ద్వారా పార్టీకి ఊపు తీసుకురావాలనుకున్నారు. అయితే అప్పుడప్పుడే కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఆ సమయంలో తనే స్వయంగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడం అసమంజసం అనుకున్నారు ముఖ్యమంత్రి జగన్. అందుకే ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఒకవైపు అప్పట్లో పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు ఫుల్ బిజీగా గడిపారు. లెక్కకు మించి సభలు, సమావేశాలు నిర్వహించారు.
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రబలిన వేళ ముఖ్య నేతలు అలాంటి పనుల్లో నిమగ్నం కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వారి పై నమ్మకాన్నే కొంత వరకూ తగ్గించి వేసింది ఆ తీరు. అయితే జగన్ మాత్రం ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా.. సభలు, సమావేశాలను నిర్వహించకుండా.. కరోనా వ్యాప్తిని ఎంతో కొంత ఆపినట్టే! అలా బాధ్యతాయుతంగానే వ్యవహరించారు ముఖ్యమంత్రి.
ఇక సెకెండ్ వేవ్ ప్రబలిన కాలంలోనే ఏపీలో పలు కార్యక్రమాలు అమలయ్యాయి. ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల సొమ్ములు జమ చేయడం, పలు ప్రారంభోత్సవాలు జరిగాయి. అయితే వాటన్నింటినీ వర్చువల్ పద్ధతిలోనే జరిపారు జగన్. ప్రచారం వస్తుందనే లెక్కలతో వాటి ప్రారంభోత్సవాలకు జనం మధ్యకు వెళ్లలేదు.
ముఖ్యమంత్రి అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే.. అధికారులకు ఎన్ని విధులుంటాయో, కార్యకర్తలు, అభిమానులు ఎంత హంగామా చేస్తారో వేరే చెప్పనక్కర్లేదు. అలాగే పార్టీ నాయకులకు కూడా చేతి నిండా పని ఉంటుంది. వీళ్లంతా సమూహాలుగా ఏర్పడక తప్పదు. దీంతో కరోనా వ్యాప్తి కూడా చాపకింద నీరులా జరిగిపోవడం ఖాయం. దీంతో జగన్ చాలా వరకూ వర్చువల్ ప్రారంభోత్సవాలకే ప్రాధాన్యతను ఇచ్చారు.
ఆ సంగతలా ఉంటే.. ఈ నెలలోనే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. ముందుగా తన సొంత జిల్లా కడప, పక్క జిల్లా అనంతపురం పర్యటనలకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నెల ఏడు, ఎనిమిది తేదీల్లో కడప, అనంతపురం జిల్లాల్లోని పలు సభల్లో జగన్ పాల్గొంటున్నారు. ముందుగా సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లి, ఆ తర్వాత కడప జిల్లాలో పలు ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు జగన్ హాజరు కానున్నారు.
ఏడు, ఎనిమిది తేదీల్లో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే ఎనిమిదో తేదీ వ్యవసాయ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన సాగనుంది. అక్కడ పలు పట్టణాలకు జగన్ వెళ్లనున్నారు. చిన్నపాటి సభల్లో కూడా పాల్గొంటున్నారు. ఇలా సెకెండ్ వేవ్ కాస్త సద్దుమణిగిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు సమాయత్తం అవుతున్నారు.