వివాహం కావొచ్చు, ప్రేమ బంధం కొత్తగా మొదలైనప్పుడు కావొచ్చు.. పార్ట్ నర్ తో చెప్పుకునే విషయాలకు కొన్ని పరిమితులు ఉంటాయి. పార్ట్ నర్ తో చక్కటి కమ్యూనికేషన్ ను ఏర్పరుచుకోవడం మంచిదే కానీ, అతిగా ఓపెనప్ అయిపోయి.. మనసులోని విషయాలన్నింటినీ చెప్పేసుకోవడం మాత్రం మంచిది కాదని అంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్ పర్ట్స్.
ప్రత్యేకించి కొత్త రిలేషన్ షిప్ కొత్త కొత్తగా ఉన్నప్పుడు కొన్ని రకాల ప్రస్తావనలు అస్సలు తీసుకురాకపోవడమే మంచిదనేది వారి సలహా. అలాంటి ప్రస్తావనల వల్ల.. మీ గురించి అవతలి వాళ్లలో ఒక రకమైన గట్టి అభిప్రాయం ఏర్పడిపోవచ్చు. అది ఎప్పటికీ చెరిగిపోయేది కూడా కాకపోవచ్చు. అందుకే కొత్తలో హ్యాండిల్ విత్ కేర్ అని అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏ విషయాల్లో అంటే..
పాత వ్యవహారాల ప్రస్తావన..
ఈ రోజుల్లో ఒకే రిలేషన్షిప్ కే పరిమితం అయిన వారెంతమంది ఉంటారనేది ప్రశ్నార్థకమైన అంశమే. కాలేజీ దశలోనో, ఉద్యోగం చేసే దశలోనో.. ఎన్నో పరిచయాలు, కొన్ని ప్రణయాలుగా మారి ఉండవచ్చు. పరిమితులతో కూడిన బంధాలు ఏవైనా ఏర్పడి ఉండవచ్చు.
ఆడకైనా, మగకైనా అది సహజం అయ్యింది ఈ రోజుల్లో. అలాంటి బంధాలు దీర్ఘకాలం సాగక, కొత్త బంధాలు మొలకెత్తుతాయి. కొత్త రిలేషన్షిప్ లో పాత ప్రస్తావనలు కూడదనేది నిపుణుల సలహా. ప్రత్యేకించి.. తను అయితే ఇలా, తను అయితే అలా.. అనే మాటలు అస్సలు వద్దంటున్నారు. అలాగే ఎక్స్ లవర్ మీద మీ కోపం, ద్వేషం, అసహ్యం తీవ్రంగా ఉన్నా.. వాటిని కొత్త పార్ట్ నర్ వద్ద కక్కేయడం మంచిది కాది. అది చెడు సంకేతాలను పంపే అంశమే!
తన ఫ్రెండ్స్ గురించి కామెంట్స్ వద్దు!
తన బంధువులు, లేదా ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చినప్పుడో, లేక మీరు వాళ్ల దగ్గరికి వెళ్లినప్పుడో… తన వారి గురించి మీరు మీ ఒపీనియన్స్ ను ఓపెన్ గా చెప్పేయడం, కామెంట్లు చేయడం కూడా మంచిది కాదు.
సదరు ఫ్రెండ్స్ తో, బంధువులతో మీ పార్ట్ నర్ ఎలాంటి రిలేషన్షిప్ ను కలిగి ఉందో ఎరగకుండా కామెంట్లు చేస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చు. అది కూడా హాట్, సెక్సీ కామెంట్స్ జోలికి అయితే అస్సలు వెళ్లకపోవడం మంచిది.
ప్రేమను నిరూపించుకొమ్మనవద్దు!
నా మీద ప్రేమను నిరూపించుకో అనడం, లేదా ప్రేమను నిరూపించుకోవడం.. ఈ కాన్సెప్ట్ కేవలం సినిమాల్లో చూసేందుకు బాగుంటుంది తప్ప వాస్తవంలో పనికి రాదు. ప్రత్యేకించి కొత్త బంధాల్లో అయితే ఈ డైలాగే ఉండకపోవడం మంచిది.
ప్రేమను వ్యక్తీకరించడంలో ఒక్కోరి తీరు ఒక్కోలా ఉండవచ్చు. అలాంటప్పుడు.. ఇలా చేస్తేనే ప్రేమ ఉన్నట్టు, అలా చేయకపోతే ప్రేమ లేనట్టు అనేది అస్సలు పనికి రాని సిద్ధాంతం. ప్రేమను నిరూపించుకోవడం అనే కాన్సెప్టే జీవితంలోని ఏ దశలోనూ పనికిరానిది. అలాంటి దాన్ని తొలి రోజుల్లోనే ప్రయోగిస్తే.. వికటించవచ్చు కూడా!
తనను గుర్తుచేస్తున్నావనవద్దు!
పాత బంధాలపై ద్వేషమే ఉండనక్కర్లేదు. కొందరికి పాత వ్యవహారాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయి ఉండవచ్చు. కొత్త రిలేషన్షిప్ లో పాత బంధాల ఫ్లేవర్ తగల వచ్చు కూడా! ఇలాంటి సమయాల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి పాత రుచి గురించి గుర్తు చేసుకుని పార్ట్ నర్ కు చెప్పేప్రయత్నం చేయడం, పాత ప్రేమగురుతులను గుర్తు చేశావని అనే డైలాగులు అస్సలు పనికొచ్చేవి కావు.
కొత్తగా జీవితభాగస్వామి అయిన వారి వ్యక్తిగత అలవాట్ల గురించి కామెంట్స్ చేయడం, కించపరచడం, వ్యంగ్యంగా స్పందించడం కూడా మంచి తీరేమీ కాదు, అలాగే వాళ్లో-నేనో తేల్చుకో, నా కోసం ఇలా మారిపో.. అనే హెచ్చరికలు కూడా తేడా కొట్టే అవకాశాలే ఎక్కువ. రూడ్ వర్డ్స్ ఉపయోగించకపోవడం సంస్కారం.