ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల మాట్లాడుకుంటారా? త్వరలో వాళ్లిద్ధరూ ఒకే వేదికపై ప్రత్యక్షం కానున్న నేపథ్యంలో, ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకుంది. రాజకీయ పంథాలు వేరైన నేపథ్యంలో వాళ్లిద్దరి మధ్య మాటలు కూడా తక్కువే అనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం రోజు మినహాయించి మరెప్పుడూ అన్నాచెల్లెళ్లు ఒకేచోట కనిపించిన దాఖలాలు లేవు.
అన్న వారిస్తున్నా వినిపించుకోకుండా తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటుకే షర్మిల మొగ్గు చూపారు. ఇది కాస్త అన్నాచెల్లెళ్ల మధ్య గ్యాప్ పెంచిందనే అభిప్రాయాలున్నాయి. పైగా తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై దీక్షకు దిగిన సందర్భంలో సాక్షి మీడియాను ఉద్దేశించి షర్మిల విమర్శలు చేశారు. తమ కార్యక్రమాలను సాక్షి చూపదు కదా అంటూ నిష్టూరమాడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా దివంగత ముఖ్యమంత్రి, తమ తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్, షర్మిల ఈ నెల 8న ఇడుపులపాయకు రానున్నారు. వాళ్లిద్దరి షెడ్యూల్స్ చూస్తే …తండ్రికి నివాళులర్పించేందుకు అన్నాచెల్లెలు దాదాపు ఒకే సమయంలో ఇడుపులపాయలో ఉండే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 7, 8, 9 తేదీల్లో కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. 7న సాయంత్రం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ ఘాట్‌లో నివాళులు అర్పిస్తారు. తర్వాత పులివెం దులలో వివిధ కార్యక్రమాలకు హాజరవుతాయి. మధ్యాహ్నం అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించనున్న రైతు దినోత్స వంలో పాల్గొంటారు. అక్కడి నుంచి తిరిగి ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
జగన్ సోదరి షర్మిల ఈ నెల 8న తన తండ్రి జయంతిని పురస్కరించుకుని పార్టీని ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా మొదట ఆమె బెంగళూరు నుంచి ఇడుపులపాయకు రోడ్డు మార్గంలో వెళ్తారు. ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. తండ్రి ఆశీస్సులు తీసుకుని కడప నుంచి ప్రత్యేక చాపర్‌లో హైదరాబాద్ వెళ్తారు. సాయంత్రం ఐదు గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తారు.
తనను కాదని తెలంగాణలో పార్టీ పెడుతున్న షర్మిలతో గతంలో మాదిరిగానే జగన్ ఆప్యాయంగా మాట్లాడ్తారా? లేక మొక్కుబడి పలకరింపులతో సరిపెడుతారా? అనే చర్చ జరుగుతోంది. సహజంగా తనను కాదని వెళ్లే వారిని జగన్ పట్టించుకోరు. అందుకే మరో మూడురోజుల్లో అన్నాచెల్లెళ్ల కలయికపై సర్వత్రా ఆసక్తి. ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ. తినబోతూ రుచి చూడడం ఎందుకు… మరో మూడు రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం.