లాక్ డౌన్ తో ఆర్థిక రంగం అతలాకుతలమైంది. పేదవాడు కూటి కోసం విపరీతంగా కష్టపడాల్సిన పరిస్థితి. మధ్యతరగతి సేవింగ్స్ అన్నీ ఊడ్చుకుపోతున్నాయి. ఉన్నత వర్గాలు మాత్రమే కరోనా కష్టకాలం తర్వాత కూడా సాధారణ జీవితం గడపగలవు అని అర్థమవుతోంది. అయితే దేశంలో 80 శాతం ప్రజలు లాక్ డౌన్ తర్వాత ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారనే విషయం ఊహలకు అందడం లేదు.
ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో కోత ఖాయం అని తేలడంతో.. ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించాల్సిన పరిస్థితి. సినిమాలు, షికార్లు, లగ్జరీలు.. అన్నీ సామాన్యులకు దూరమౌతాయి. నిత్యావసరాల కొరత, డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడం కూడా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతిపై పెను భారం మోపే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా వేతనజీవుడు కుదేలవ్వడం ఖాయం.
లాక్ డౌన్ తర్వాత దేశం పూర్తిగా కోలుకునే వరకు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పాల ఉత్పత్తుల రేట్లు విపరీతంగా పెరిగే అవకాశముంది, ఉప్పు, పప్పులు, నూనెల రేట్లు కూడా అనూహ్యంగా పెరుగుతాయి. కరోనా టైమ్ లో బ్లాక్ మార్కెట్లపై నిఘా ఉంచిన అధికార వర్గాలు.. రేట్లు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే లాక్ డౌన్ పూర్తయ్యాక ఇలాంటి నిఘా ఉండొచ్చు, ఉండకపోవొచ్చు. పైగా ముడి సరకు కొరత, రవాణా ఖర్చు పెరగడం వంటి వాటిని అడ్డం పెట్టుకుని అధికారికంగానే అన్ని వస్తువుల రేట్లు పెరిగే అవకాశముంది.
అటు వినియోగదారుడి వద్ద కొనుగోలు శక్తి తగ్గుతుంది, ఇటు వ్యాపార వర్గాలు డిస్కౌంట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఒకరకంగా మార్కెట్ కొన్నాళ్లు స్తబ్దుగా మారే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో అత్యంత అవసరమైన వస్తువుల కొనుగోలుకే వినియోగదారులు ఆసక్తి చూపిస్తారు. విలాస వస్తువులు, బట్టలు, సౌందర్య సామగ్రి.. వీటిపై పెట్టే ఖర్చులో గణనీయమైన తగ్గుదల ఉంటుంది.
ఒకరకంగా లాక్ డౌన్ తర్వాత జనసామాన్యంలో సాధారణ పరిస్థితి నెలకొన్నా.. కొన్ని సంవత్సరాల పాటు మధ్యతరగతి జీవనం మాత్రం కష్టంగానే ఉంటుందంటున్నారు నిపుణులు. ఏఏ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు పోతాయో ఊహించడం కూడా కష్టంగా ఉందంటున్నారు.