జగన్ సర్కార్ మీద ఉప రాష్ట్రపతికి ఫిర్యాదు

ఏపీలో జగన్ ప్రభుత్వం మీద రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని కొద్ది నెలల క్రితం ఢిల్లీలో ఆయన రాష్ట్రపతిని…

ఏపీలో జగన్ ప్రభుత్వం మీద రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని కొద్ది నెలల క్రితం ఢిల్లీలో ఆయన రాష్ట్రపతిని కలసి వినతిపత్రం ఇచ్చారు.

సీన్ కట్ చేస్తే తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత జగన్ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేశారు. ఏపీలో మహిళలకు ఎక్కడా న్యాయం జరగడంలేదని, ఎటు చూసినా వారి మీద దాడులు జరుగుతున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున మహిళల మీద నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని కూడా ఆమె చెబుతున్నారు.

అలాగే, ప్రభుత్వం దిశ చట్టం పేరిట ప్రజలను మోసం చేస్తోందని కూడా అనిత ఫిర్యాదు చేయడం విశేషం. ఇక ఏపీలో జగన్ ప్రభుత్వ హయాంలోనే మహిళల మీద నేరాలు ఎక్కువగా పెరిగాయని, ఇందులో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలే ఉంటున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. వీటి మీద సమగ్రమైన దర్యాప్తును జరిపించాలని ఆమె ఉప రాష్ట్రపతికి అందచేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు విశాఖలో వెంకయ్యనాయుడు పర్యటించారు. ఆయన లోకల్ గా పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. మొత్తానికి ఆయనను చాలా మంది కలిశారు కానీ రాజకీయపరమైన ఫిర్యాదులు మాత్రం ఫస్ట్ టైమ్ టీడీపీ నుంచే వెళ్ళడం విశేషం. మరి దీని మీద ఉప రాష్ట్రపతి ఏం చేస్తారు, ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తిని గొలుపుతున్న అంశం. ఏం జరుగుతుంది అన్నది చూడాలి.