తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని మరోసారి తిప్పికొట్టారు మంత్రి కొడాలి నాని. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి తనను వివరణ అడిగారనే కథనాన్ని కూడా తోసిపుచ్చారు. ఎల్లో మీడియా సృష్టించే కథనాల గురించి జగన్ కు బాగా తెలుసని, అందుకే తనను ఏమీ అడగలేదన్నారు.
“పండగ టైమ్ లో కరోనాతో నేను హాస్పిటల్ లో ఉన్నాననే విషయం జగన్ గారికి తెలుసు. క్యాసినో లాంటిది అక్కడేం జరగలేదనే విషయం ఆయనకు తెలుసు. ఇది బోగస్ న్యూస్ అని ఆయనకు తెలుసు. చంద్రబాబు మీడియా గురించి ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఆయన ఇవేం పట్టించుకోలేదు. నన్నేం అడగలేదు. నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.”
తనపై క్యాసినో ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు.. గతంలో తన కొడుకు లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చుకున్నారని, కానీ లోకేష్ ఎలాంటి వాడో అతడి పాత ఫొటోలు చూస్తే అర్థమౌతాయని విమర్శించారు నాని.
“లోకేష్ ఫోటోలు అందరం చూశాం. స్విమ్మింగ్ పూల్ లో బట్టల్లేకుండా నిలబడి, నలుగురు అమ్మాయిలతో, మందు గ్లాసు పట్టుకొని, ఓ అమ్మాయి బొడ్డులో పుల్ల పెట్టి ఊపుతున్న ఫొటోలు లోకేష్ వే కదా. అలాంటి లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. ఏకంగా 3 శాఖలు కట్టబెట్టారు. చంద్రబాబు కొడుకైతే మాత్రం అలా చేయొచ్చా? నాకేం సంబంధం లేకపోయినా క్యాసినో అంటూ నాపై ఆరోపణలు చేస్తే నేను రాజీనామా చేయాలా? చంద్రబాబుకు సిగ్గుందా అసలు మాట్లాడ్డానికి.”
చంద్రబాబు, అతడి మీడియా, కుల సంఘాలు కలిసి ఆడుతున్న నాటకంగా దీన్ని చెప్పుకొచ్చారు మంత్రి. ఇలాంటి ఆరోపణలు తనకు కొత్త కాదని, చంద్రబాబు లాంటోళ్లను తన జీవితంలో వంద మందిని చూశానని అన్నారు.