ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతుందంటే చాలు దళారీలు వాలిపోతారు. ముందుగా అడ్వాన్స్ ఇవ్వండి, పోస్ట్ వస్తేనే మిగతా డబ్బులివ్వండి అంటూ బేరంపెట్టి అమాయకులైన అభ్యర్థుల దగ్గర లక్షలు గుంజుతారు. గతంలో ఇలాంటి వ్యవహారాలు బాగానే జరిగాయి. ఇప్పుడు జగన్ హయాంలో ఉద్యోగాల భర్తీ వెల్లువలా జరుగుతోంది. కానీ ఎక్కడా దళారీల జాడలేదు. పైపెచ్చు అంతా వణికిపోతున్నారు.
గ్రామ వాలంటీర్ల పోస్ట్ ల భర్తీ విషయంలోనే జగన్ అంటే ఏంటో అందరికీ తెలిసింది. ఎక్కడా ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా కేవలం మెరిట్ ప్రకారమే ఈ పోస్టులివ్వనున్నారు. గ్రామ సచివాలయాల పోస్టులకు గాను 1,26,728 ఈనెల మొదటి వారంలో పరీక్షలు ముగిశాయి. పరీక్ష రాసిన 19.74 లక్షల మంది రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్-2న వీరికి అపాయింట్ మెంట్లు ఇవ్వాల్సి ఉండగా త్వరలోనే ఫలితాలు విడుదల కాబోతున్నాయి.
సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే దళారీలు రంగప్రవేశం చేస్తుంటారు. ఈసారి కూడా అభ్యర్థులకు ఎరవేయడానికి సిద్ధమయ్యారు కొంతమంది మధ్యవర్తులు. పరీక్షలకు ముందు ఒక్కో పోస్ట్ కి 15లక్షల వరకు బేరం పెట్టారు. కానీ ఇది చంద్రబాబు జమానా కాకపోవడం వారికి శాపంగా మారింది. అవినీతిరహిత పాలన అందిస్తానని చెబుతున్న జగన్ దాన్ని చేతల్లో చూపిస్తున్నారు. కనీసం మంత్రులు కూడా తమ వారికి ఉద్యోగాలపై భరోసా ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడుంది.
మా చేతిలో ఏం లేదు, అంతా ప్రాసెస్ ప్రకారమే జరుగుతుందని చెబుతున్నారు మంత్రులు. మరోవైపు దళారీలు, కొంతమంది అధికారులు కూడా ఇలాంటి తెరవెనక కార్యక్రమాలు ఆపేశారు. దీంతో ఎక్కడా ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదని తేలిపోయింది. చివరికి పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే.. స్వయంగా అభ్యర్థులే కొంతమంది దళారీలను ఆశ్రయిస్తున్నా తమచేతిలో ఏం లేదని చెప్పేస్తున్నారు, కొన్నిచోట్ల అడ్వాన్స్ లు కూడా తిరిగిచ్చేస్తున్నారు.
మరోవైపు వీటికి సంబంధించి ఫోన్ కాల్స్ కూడా ట్యాప్ చేస్తున్నారనే కథనాలు రావడంతో దళారీ వ్యవస్థ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. గ్రామ సచివాలయాల పోస్ట్ ల భర్తీ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని అందరికీ అర్థమైంది. గాంధీజయంతి రోజున.. గాంధీ ఆశయాలకు తగ్గట్టే.. పూర్తి పారదర్శకంగా, కేవలం ప్రతిభే కొలమానంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరు కాబోతున్నారు.