తాజాగా విశాఖలో మూడు రోజుల పాటు మకాం వేసి పార్టీ కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ తీరుతెన్నులను కూడా పరిశీలించారని పార్టీ వర్గాలు తెలియచేశాయి.
ఇక జనసేన సమావేశంలో మూడు జిల్లాల్లో రాజకీయ పరిణామాలను ఇతర పార్టీల బలబలాను గురించి కూడా చర్చించారని అంటున్నారు.
మరో వైపు పవన్ విశాఖ టూర్ సందర్భంగా పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని అంతా భావించారు. దాని మీద ప్రచారం కూడా సాగింది. అయితే ఈసారి అలాంటిది ఏమీ జరగలేదు. కానీ విశాఖ నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఒక నేత మాత్రం ఆ పార్టీకి రాజీనామా చేసి మరీ జనసేన తీర్ధం తీసుకున్నారు.
దాంతో జనసేనకు ఎంతో కొంత ఊరట లభించింది అంటున్నారు. నిజానికి ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జనసేనలో చేరుతారు అని అనుకున్నారు. అలాగే కొందరు ప్రజారాజ్యం మాజీలు కూడా తమ గూటికి వస్తారని కూడా భావించారు.
అయితే అదిపుడు కాదు అన్న మాట ఉందిట. మరోసారి పవన్ విశాఖ టూర్లో ఈ చేరికలు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతానికి పవన్ సమక్షంలో ఒకే ఒక చేరిక మాత్రం జరిగింది. అయితే చాలానే చేరికలు ఉంటాయని జనసైనికులు గట్టిగానే చెబుతున్నారు. దానికి ఒక టైమ్ ఉందని కూడా ఊరిస్తున్నారు. చూడాలి మరి ఆ బిగ్ షాట్స్ ఎవరో.