కాంగ్రెస్‌, టీడీపీ పెట్టిన కేసులు ఏమవుతున్నాయో?

రాజకీయాలలో కక్ష, ద్వేషం ఎలా ఉంటాయో, అధికారం పోయిందన్న దుగ్ధ ఒకరిదైతే, తమనే దిక్కరిస్తారన్న అహంకారం మరొకరిది. ఆ ఇద్దరు కలిసి అప్పడే రాజకీయాలలోకి వచ్చిన యువకుడిని నానాబాధలు పెట్టారు. ఏళ్లతరబడి వెతలకు గురిచేశారు.…

రాజకీయాలలో కక్ష, ద్వేషం ఎలా ఉంటాయో, అధికారం పోయిందన్న దుగ్ధ ఒకరిదైతే, తమనే దిక్కరిస్తారన్న అహంకారం మరొకరిది. ఆ ఇద్దరు కలిసి అప్పడే రాజకీయాలలోకి వచ్చిన యువకుడిని నానాబాధలు పెట్టారు. ఏళ్లతరబడి వెతలకు గురిచేశారు. అయినా అతను నిలబడ్డాడు. పోరాడాడు. జనం మససులు గెలుచుకున్నారు. అధికారంలోకి వచ్చారు. ఆయన ఎవరో ఈపాటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ గురించే ఇటీవలికాలంలో జగన్‌ కంపెనీలలో పెట్టుబడుల గురించి వెలువడుతున్న తీర్పులు చూసిన తర్వాత ఎవరికైనా ఏమి అర్థం అవుతుంది?

జగన్‌పై అంత దారుణంగా కేసులు పెట్టారని ఇట్టే తెలిసిపోతుంది. ఎన్‌ పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ పెన్నా ఆస్తుల కేసులో కాని, జగతి పబ్లికేషన్‌ కేసులో కాని భారతి సిమెంట్‌ కేసులో కాని, వాన్‌పిక్‌ కేసులో కాని ఆస్తులను జప్తుచేసిన తీరును ట్రిబ్యునల్‌ న్యాయమూర్తులు తప్పుపట్టిన తీరుచూస్తే కేసులు ఎంత అద్వాన్నంగా పెట్టారో తెలుసుకోవచ్చు. కోటి రూపాయల లాభం వస్తుందని ఎవరైనా ఏబై కోట్ల పెట్టుబడి పెడతారా అని ట్రిబ్యునల్‌ ఆశ్చర్యం వ్యక్తంచేసిన తీరు సీబీఐకి గాని, ఈడీ అధికారులకు కాని కనువిప్పుకావాలి.

అధికారంలో ఉన్న రాజకీయ నేతల ప్రోద్బలంతో, వారి మెప్పుపొందేందుకు కేసులు పెడితే దానివల్ల ఎవరికి మేలు జరగింది. ఒకటికి పది చార్జీషీట్లు వేస్తే జగన్‌ లొంగిపోతారనుకుని కాంగ్రెస్‌ అధిష్టానం భావించింది. సీబీఐ లక్ష్మీ నారాయణను ఉసికొల్పి ఇష్టారాజ్యంగా చేసింది. రాజకీయంగా ప్రత్యర్థులైన కాంగ్రెస్‌, టీడీపీలు కుమ్మక్కై పెట్టిన ఈ కేసులలో న్యాయవ్యవస్థ గురించి మనం ఏమి అనకూడదు కాని, ఇప్పుడు అదే న్యాయవ్యవస్త చేస్తున్న వ్యాఖ్యలు కచ్చితంగా పరిశీలించదగినవి. మరి ఇదేభావన గతంలో న్యాయవ్యవస్థలోని వారికి ఎందుకు రాలేదంటే ఏమిచెబుదాం.

నెలల తరబడి జైలులో ఉంచడానికి ఏ చట్టం అనుమతిస్తుందంటే ఏమిచెబుతాం. ఈ కేసులలో ఎక్కడా అవినీతి ప్రక్షాళనపై కాకుండా కేవలం జగన్‌పై కక్షతోనే వ్యవహరించాన్న విషయం ఎవరికైనా తెలిసిపోతుంది. లక్ష్మీనారాయణ సీబీఐ అధికారిగా ఉన్నప్పుడు రోజూ పత్రికలకు ఎలా లీకులు ఇచ్చారు? ఆ తర్వాత వచ్చిన అధికారులు ఎందుకు అలా లీకులు ఇవ్వలేదు? వాన్‌పిక్‌ ప్రాజెక్టులో జప్తులను తప్పుపట్టడమే కాకుండా, ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లవచ్చని ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చిందన్న వార్త చదివని తర్వాత ఒక విషయం అవగాహనకు వస్తుంది.

రాజకీయంగా పెట్టే ఇలాంటి కేసుల వల్ల కొన్ని సంవత్సరాలపాటు జగన్‌కు, మరికొందరికి ఇబ్బంది వచ్చి ఉండవచ్చు. కాని దానివల్ల ఆంధ్రప్రదేశ్‌ స్థూలంగా నష్టపోయింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్‌ ప్రాజెక్టులు, ఓడరేవు, పలు ఇతర పరిశ్రమలు స్థాపించడానికి 11 వేల ఎకరాల వరకు సేకరించారు. అందులో అస్సైన్డ్‌ భూములు ఉంటే వాటి యజమానులకు, వాటిని అనుభవిస్తున్న వారికి కూడా ఉదారంగా పరిహారం అందించారు. అప్పుడే ఈ ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ అధిష్టానం, టీడీపీ నాయకత్వం అడ్డుపడకుండా ఉండి ఉంటే, గుంటూరు, ప్రకాశం జిల్లాల మద్య ఒక పెద్ద పారిశ్రామిక కారిడార్‌ ఏర్పడడానికి అవకాశం ఉండేది.

కాని మద్యలోనే ఆగిపోవడం వల్ల వందల కోట్ల పెట్టుబడి పెట్టిన వివేశీ కంపెనీ ఇప్పుడు నిమ్మగడ్డపై కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ భూమి సేకరణ తర్వాత పరిశ్రమలు రాకపోతే అప్పుడు కేసులుపెట్టినా అభ్యంతరం ఉండదు. కాని ఎక్కడ పరిశ్రమలు వస్తాయో, ఎక్కడ ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అన్న దుగ్ధతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన దుర్మార్గపు పన్నాగానికి ఆ ప్రాంతం అన్యాయం అయిపోయిందని చెప్పాలి.

ఏది ఏమైనా ఇప్పటికైనా జగన్‌ ప్రభుత్వం ఆ భూములను వినియోగించి అక్కడ పరిశ్రమలు వచ్చేలా చేయగలిగితే ఏపీకి గొప్ప మేలు చేసినవారు అవుతారు. అదే కేసులు పెట్టినవారికి గుణపాఠం అవుతుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు

అగమ్యగోచరంగా టీడీపీ… అంతుబట్టని తీరులో జనసేన