నేతల ఆదాయానికి గండి..!

మూసుకుపోతున్న మార్గాలు ఇసుక, మట్టి, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియాలకు చెక్‌ గత ప్రభుత్వానికి భిన్నంగా వైకాపా పావులు పాలనపై పట్టు బిగించిన జగన్‌ అక్రమార్జనకు అలవాటుపడ్డ నేతల పాలిట వైకాపా ప్రభుత్వం శిరోభారంగా మారింది.…

మూసుకుపోతున్న మార్గాలు
ఇసుక, మట్టి, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియాలకు చెక్‌
గత ప్రభుత్వానికి భిన్నంగా వైకాపా పావులు
పాలనపై పట్టు బిగించిన జగన్‌

అక్రమార్జనకు అలవాటుపడ్డ నేతల పాలిట వైకాపా ప్రభుత్వం శిరోభారంగా మారింది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలనపై పట్టు బిగిస్తూనే, ఇంకోవైపు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు అడ్డుకట్ట వేసేదిశగా తీసుకుంటున్న చర్యలు సదరునేతల్లో గుబులు రేపుతున్నాయి. ముఖ్యంగా వివిధ స్కాముల్లో కీలకంగా చక్రంతిప్పిన నేతలకు జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు కంటికి నిద్రలేకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతికి అస్కారం లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటూ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి జగన్‌కు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదు!

గత ప్రభుత్వంలో చక్రంతిప్పిన వివిధ రకాల మాఫియాలకు ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పంతమాత్రం మింగుడుపోవడం లేదు. ముఖ్యంగా సహజ వనరులకు చిరునామాగా మారిన గోదావరి జిల్లాల్లో ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు కొందరునేతల అక్రమాలకు అడ్డుకట్ట వేశాయి. వివిధ శాఖల అధికారుల ఆదాయ మార్గాలకూ దెబ్బకొట్టేలా మారాయి. గత ప్రభుత్వంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగాయి. రేయింబవళ్ళు బార్లు బార్లా తెరుచుకుని ఉండేవి!

ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభంలోనే బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం మోపింది. అక్రమ మద్యం విక్రయాలపై కొరడా ఝుళిపించింది. దీంతో ఆయా ప్రాంతాల మద్యం సిండికేట్లు ఇపుడు మద్యం వ్యాపారం చేయాలంటే బెంబేలెత్తుతున్నారు. ఫలితంగా నేతలు, అధికారులకు నెలవారీ పంపకాలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో అక్రమ మద్యం విక్రయాలను ప్రోత్సహించినందుకు గాను ప్రతినెలా ఆయా నియోజకవర్గాల నేతలకూ, సంబంధిత శాఖల అధికారులకూ సిండికేట్ల నుండి దండిగా మామూళ్ళందేవి! ఇపుడా అవకాశం లేకపోయిందని, ఇందుకు జగన్‌ తీసుకున్న కీలక నిర్ణయాలే కారణమని జనం చెప్పుకుంటున్నారు.

ఇక ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం విధించిన నిషేదం సామాన్యులకు ఇబ్బందులు కలుగజేసినప్పటికీ ఇసుక మాఫియాను మాత్రం నిలువునా ముంచేసింది. అక్రమ ఇసుక తవ్వకాలకు తావులేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఇసుక దందా నిలిచింది. ఫలితంగా నేతల మామూళ్ళకు బ్రేక్‌ పడింది. ఇసుక వాటాల విషయంలో ఆయా పార్టీల నేతలందరూ ఒకే తానులో ముక్కలని జనం చర్చించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికార, విపక్షాలకు చెందిన పలువురు ఇసుకాగ్రేసరులు ప్రథాన ఆదాయ వనరులను కోల్పోయినట్టయ్యింది.

అయితే నూతన ఇసుక పాలసీ అమల్లోకి వస్తే తప్ప ఈ విషయంలో ఓ స్పష్టత రాదని తెలుస్తోంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో మట్టి, మైనింగ్‌ మాఫియాలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చెలరేగిపోయాయి. జిల్లా మంత్రుల సహకారంతో కొందరునేతలు మాఫియాతో చేతులు కలిపారు. గత ఐదేళ్ళలో వందల కోట్ల రూపాయలను దోచుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మైనింగ్‌, మట్టి మాఫియా విషయంలో అనుసరించే వైఖరి ఏ విధంగా ఉంటుందన్న విషయమై సదరు మాఫియా ఆత్రంగా ఎదురుచూస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా మైనింగ్‌ మాఫియా నుండి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ మంత్రికి పెద్దఎత్తున వాటాలు అందేవని, ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ టీడీపీనేత కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. సదరునేత ఇపుడు అధికార పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదువుతున్నట్టు సమాచారం! అయితే తమ ప్రభుత్వం ఇటువంటి మాఫియాలను ప్రోత్సహించదని, ఎటువంటి నిర్ణయాన్నైనా చట్టపరంగానే తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌ పదే పదే చెబుతున్నారు.

ఇదిలావుంటే గోదావరి జిల్లాల్లో గతంలో భూ ఆక్రమణలు భారీగా జరిగాయి. ఆక్రమ భూకేటాయింపులతో పాటు కొందరు ప్రజా ప్రతినిధులు స్వయంగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేసినట్టు స్పష్టమయ్యింది. కాకినాడ నగరంలో పోర్టు, రైల్వే భూములను సైతం కొందరు నేతలు ఆక్రమించుకోవడం అప్పట్లో కలకలం రేపింది. ఇటువంటి అక్రమాలపై జగన్‌ ఏ విధంగా స్పందించనున్నారన్న అంశం ఇపుడు ఆయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అగమ్యగోచరంగా టీడీపీ… అంతుబట్టని తీరులో జనసేన