సరిలేరు నీకెవ్వరు.. మహేష్ చేస్తున్నకొత్త సినిమా ఇది. ఈ మూవీ నిర్మాత ఎవరని ప్రశ్నిస్తే నేరుగా సమాధానం చెప్పడంకష్టం. పైకి అనీల్ సుంకర, దిల్ రాజు నిర్మాతలుగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం నిర్మాణ భాగస్వామ్యం విషయంలో తకరారు నడుస్తోంది. తప్పుకుంటానని దిల్ రాజు అంటుంటే.. మహేష్, అనిల్ రావిపూడి ససేమిరా అంటున్నారు.
మరొకరితో చేతులు కలిపి ఈ సినిమా చేయడం దిల్ రాజుకు ఇష్టం లేదు. మేజర్ పార్ట్ తనే తీసుకోవాలనేది దిల్ రాజు కోరిక. అలాఅని అనీల్ సుంకరను తప్పించేంత సాహసం చేయలేరు. ఎందుకంటే అనీల్ సుంకర అడ్వాన్స్ మహేష్ వద్ద కొన్నేళ్లుగా ఉంది. పోనీ దిల్ రాజును తప్పిద్దామంటే ఆ పని చేయడం మహేష్ కు ఇష్టంలేదు.
మహర్షి సినిమాలో దిల్ రాజు వర్కింగ్ స్టయిల్ మహేష్ కు బాగా నచ్చింది. కంటెంట్ విషయంలో కలుగజేసుకోవడంతో పాటు సినిమాను స్మూత్ గా రిలీజ్ చేయడంలో దిల్ రాజు ఎక్స్ పర్ట్. దీనికితోడు దర్శకుడు అనీల్ రావిపూడి, దిల్ రాజుకు ఎంతో క్లోజ్. వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తే ఔట్ వుట్ మరింత బాగుంటుందనేది మహేష్ నమ్మకం. అందుకే దిల్ రాజును వదులుకోవడానికి ఇష్టపడడం లేదు.
అటు దిల్ రాజు పరిస్థితి మాత్రం మరోలా ఉంది. మహర్షి సినిమా ఆర్థికంగా ఇతడికి ఏమాత్రం కలిసిరాలేదు. కష్టమంతా తనది, షేర్ మాత్రం పీవీపీ, అశ్వనీదత్ కు వెళ్లింది. పైగా మహేష్ ను దృష్టిలో పెట్టుకొని, పైకి లాభాలు వచ్చినట్టు ప్రకటించినప్పటికీ, తనకు ఏం మిగల్లేదని రీసెంట్ గా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఆఫ్ ది రికార్డు బాధపడ్డాడు దిల్ రాజు.
సరిలేరు నీకెవ్వరు విషయంలో కూడా ఇలానే జరుగుతుందనేది దిల్ రాజు భయం. తను కష్టపడి, లాభం అనీల్ సుంకరకు ఇవ్వాల్సి వస్తుందని బాధ. అలాగని మహేష్ ను కాదని తప్పుకోలేదు. నిర్మాణ భాగస్వామ్యంలో ఎవరికి ఎంత వాటా అనేది తేలేవరకు ఈ ముసుగులో గుద్దులాటలు తప్పవేమో. అటు మహేష్ మాత్రం ఎంచక్కా తన వాటా కింద నాన్-థియేట్రికల్ రైట్స్ తీసుకొని సైడ్ అయిపోయాడు.