వినాయక చవితి వేడుకలపై ఏపీలో వివాదం నెలకుంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని జనం గుమిగూడకుండా తీసుకునే చర్యలపై స్పష్టత ఏదీ? అని కేసీఆర్ సర్కార్‌ను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించడం ఆకర్షించింది. కరోనా నేపథ్యంలో పండుగ రోజు జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకుని, మహమ్మారిని దగ్గరకు రాకుండా చేయాలనే తపన తెలంగాణ హైకోర్టు కామెంట్స్‌లో కనిపించింది.
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనం నిషేధించాలని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. వినాయక నిమజ్జనంపై సూచనలు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వం నివేదిక సమర్పించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్ఎంసీపై అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరికే లేదా? అని ధర్మాసనం మండిపడింది. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో జనం ఒక్క చోట భారీగా పోగు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రభుత్వం స్పష్టం చేయలేకపోతోందని హైకోర్టు ధర్మాసనం అసహనం పేర్కొంది. ఇలాగైతే తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు రిజర్వ్ చేసింది.
వినాయక చవితి పండుగకు జనం గుమిగూడకుండా ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో భాగంగా జనాన్ని ఒక చోట చేరకుండా తీసుకునే చర్యలపై స్పష్టత లేదని కేసీఆర్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.