కరోనా ఫోర్త్ వేవ్.. కుమ్మేస్తుందా..? కనికరిస్తుందా..?

కరోనా థర్డ్ వేవ్ భయపెట్టింది కానీ, దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. అసలు దాన్ని థర్డ్ వేవ్ అని పిలవాలా వద్దా అనే అనుమానం కూడా ఉంది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం, వ్యాక్సినేషన్ జోరుగా…

కరోనా థర్డ్ వేవ్ భయపెట్టింది కానీ, దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. అసలు దాన్ని థర్డ్ వేవ్ అని పిలవాలా వద్దా అనే అనుమానం కూడా ఉంది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం, వ్యాక్సినేషన్ జోరుగా సాగడం, థర్డ్ వేవ్ లో వచ్చిన ఒమిక్రాన్ మ్యుటేషన్ ప్రభావం కూడా పెద్దగా లేకపోవడంతో నష్టం లేకుండా జనం ఒడ్డునపడ్డారు. మరిప్పుడు ఫోర్త్ వేవ్ అంటున్నారు. దీని సంగతేంటి..?

కరోనా వేవ్ వస్తుందంటే జనం ముందుగానే భయపడే రోజులివి, కానీ థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఫోర్త్ వేవ్ ని అందరూ లైట్ తీసుకునే పరిస్థితి. అయితే ఫోర్త్ వేవ్ మాత్రం కంపల్సరీ అంటున్నారు నిపుణులు. 

జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు ఫోర్త్ వేవ్ ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాన్పూర్ ఐఐటీకి చెందిన పరిశోధకులు ఫోర్త్ వేవ్ పై కీలక విషయం వెల్లడించారు. అయితే దీని తీవ్రతపై మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.

కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్లిన్లు, బూస్టర్ డోస్ ల ప్రభావం ఆధారంగా ఫోర్త్ వేవ్ ప్రభావం ఎలా ఉందో అంచనా వేయొచ్చు. బూస్టర్ డోస్ ల వల్ల కలిగే ఇమ్యూనిటీ నిలబడగలిగితే ఫోర్త్ వేవ్ ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ఇమ్యూనిటీని మించి మ్యుటేషన్ ఇబ్బంది పెడితే మాత్రం ఫోర్త్ వేవ్ ప్రభావం గట్టిగా ఉంటుంది.

ఫోర్త్ వేవ్ – 4 నెలలు..

కరోనా ఫోర్త్ వేవ్ ప్రభావం 4 నెలలపాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూన్ 22నుంచి అక్టోబర్ 24వరకు దీని ప్రభావం ఉంటుందని, ఆగస్ట్ 15నుంచి 31 మధ్యలో కేసుల సంఖ్య గరిష్టానికి చేరుకుంటుందని చెబుతున్నారు. గతంలో వచ్చిన ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ విషయంలో కాన్పూర్ శాస్త్రవేత్తల అంచనాలు నిజమయ్యాయి. 

ఇప్పుడు ఫోర్త్ వేవ్ విషయంలో కూడా వీరి అంచనాలు నూటికి నూరుశాతం నిజమవుతాయనే నమ్మకం కూడా ఉంది. అదే నిజమైతే జనాలు ఫోర్త్ వేవ్ కి సిద్ధంగా ఉండాల్సిందే. ఈలోగా ప్రజలందరికీ బూస్టర్ డోస్ ఇచ్చే విషయంపై ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టిపెడితే మంచిది.