రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన స్నేహం ఎలా ఉంటుందనే విషయంపై భీమ్లా నాయక్ మూవీ ఓ క్లారిటీ ఇచ్చింది. వన్ సైడ్ లవ్ కాస్తా టు సైడ్ అవ్వడానికి ఎన్నో రోజులు దూరం లేదని తేలిపోయింది. ఇప్పటి వరకూ త్యాగరాజుగానే గుర్తింపు తెచ్చుకున్న పవన్.. 2024నాటికి మాత్రం టీడీపీని త్యాగరాజు స్థానంలో కూర్చోబెట్టబోతున్నారు. ఇంతకీ ఏయే జిల్లాల్లో టీడీపీ నేతలకు, జనసేన నేతలు టికెట్ల విషయంలో ఎసరు పెట్టబోతున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.
2014లో బీజేపీ, టీడీపీతో ఉమ్మడిగా దోస్తీ చేసిన పవన్ కల్యాణ్ జనసేనను బరిలో దించలేదు, జనసేన తరపున ఎవరినీ పోటీకి పెట్టలేదు. దీంతో బీజేపీ, టీడీపీ టికెట్లు పంచుకుని లాభపడ్డాయి. చివరకు పవన్ ని కూరలో కరివేపాకులా పక్కనపెట్టడంతో.. సొంతంగా ఎమ్మెల్యేలు ఉంటేనే తనకి బలం ఉంటుందని ఆలోచించారు పవన్. అనుకున్నదే తడవుగా 2019లో తాను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడంతోపాటు తన బ్యాచ్ ని రంగంలోకి దించారు.
వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు అన్నారు కానీ ఓటింగ్ సమయానికి అదేమీ కలసి రాలేదు. పవన్ రెండుచోట్లా ఓడిపోగా.. రాపాక వరప్రసాద్ ఒక్కరే పవన్ పరువు నిలబెడుతూ జనసేన తరపున గెలిచిన ఏకైక తొలి ఎమ్మెల్యేగా పేరు సంపాదించారు. కానీ ఆ ఒక్కడిని కాపాడుకోవడం పవన్ కి సాధ్యం కాలేదు. ప్రాక్టికల్ గా చూస్తే, ప్రస్తుతానికి జనసేన ఎమ్మెల్యేల సంఖ్య జీరో.
2024లో ఏకంగా సీఎం కుర్చీనే ఆశిస్తున్న పవన్.. టీడీపీ, బీజేపీతో కలసి పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే కమలదళంతో కలసి వెళ్తుండగా.. మధ్యలో టీడీపీ వచ్చి చేరడానికి ఉత్సాహం చూపిస్తోంది. భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా టీడీపీ అధినేతలు, కొసరు నేతలు చేసిన హడావిడే దీనికి నిదర్శనం.
టీడీపీ పాత కాపుల పరిస్థితి ఏంటి..?
జనసేన బరిలో దిగితే, అందులోనూ బాబు బతిమిలాడి మరీ పవన్ ని తనవైపు తిప్పుకుంటున్నారు కాబట్టి.. కచ్చితంగా బెట్టు చేస్తారు. అంటే 50 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు అడుగుతారని తెలుస్తోంది. అది కూడా ఆషామాషీ సీట్లు కాదు, కీలక నియోజకవర్గాలే జనసేన కోరే అవకాశముంది. మరి ఆ 50చోట్ల టీడీపీ ఇన్ చార్జులు ఏం కావాలి..? టీడీపీ టికెట్లపై ఆశలు పెట్టుకున్నవారంతా ఏం చేయాలి..? మధ్యలో బీజేపీని తెలివిగా తప్పించినా.. జనసేనతోనే టీడీపీకి చిక్కులు మొదలయ్యేలా ఉన్నాయి.
అయితే చంద్రబాబు ఓ వ్యూహం ప్రకారం టీడీపీ నేతలకే జనసేన తరపున టికెట్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది. 2014లో బీజేపీతో కలిసి పోటీచేసినప్పుడు చంద్రబాబు ఇదే పని చేశారు. అయితే కొన్నిచోట్ల ఇలాంటి జిమ్మిక్కులు జరిగినా, మిగతా చోట్ల టీడీపీ నేతలకు నిరాశ తప్పదు. అందుకే ముందస్తు సిగ్నల్స్ వచ్చినవారంతా ఇప్పుడు టెన్షన్ పడిపోతున్నారు.
చివరి నిమిషంలో వైసీపీ నుంచి టికెట్ దొరకనివాళ్లని కూడా చంద్రబాబు తనవైపు తిప్పుకుని అప్పటికప్పుడే టీడీపీ టికెట్ ఆఫర్ చేసే ఉద్దేశంలో కూడా ఉన్నారట. ఈ లెక్కలన్నీ వేసుకుంటే 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున త్యాగరాజుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది.