ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ ఉంది. ఒకవైపు భారీ ఎత్తున టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల విషయంలో మాత్రం తగ్గుదల నమోదవుతున్న రాష్ట్రంగా నిలుస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 33 వేల స్థాయిలో మాత్రమే ఉంది. రికవరీల సంఖ్య భారీగా ఉండటం, కొత్త కేసుల నమోదు తగ్గడంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదైన రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే దేశంలో అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
చాలా రాష్ట్రాల్లో నిర్ధారణ పరీక్షల పట్ల అంత శ్రద్ధ చూపించకుండా, తక్కువ కేసులు నమోదైనట్టుగా పేర్కొనగా, ఏపీ మాత్రం దేశంలోనే ఎక్కువ స్థాయి పరీక్షలు చేసిన రాష్ట్రంగా నిలిచింది, నిలుస్తోంది.
భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతుందనే అంచనాకు రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో కూడా కొత్త కేసుల కన్నా రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంది.
దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. ఇదే తరహాలో మరొ కొన్ని రోజుల పాటు కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడితే… ఏపీలో యాక్టివ్ కేసుల లోడు జీరో స్థాయికి చేరే అవకాశం ఉంది.