ఎవరి వాదన వారు చేసుకోవచ్చు. ఎవరి మాటలు వారు విసురుకోవచ్చు. కానీ ఆ మాటలు మరీ సత్యదూరంగా, అసత్యపూరకంగా వుంటే భలే చిత్రమనిపిస్తుంది. ఇలాంటి మాటలు పేరు మోస్తున్న జర్నలిస్టుల నోట వస్తే హతవిధీ అనిపిస్తుంది.
తెలుగుదేశం పార్టీని, దాని విధానాలను, దాని సామాజిక మూలాలను భుజాన మోసే ఓ మీడియా డిస్కషన్ లో దాని మోడరేటర్ వాడిన కింది వాక్యాలు చూడండి.
ప్రపంచంలోనే రాజధాని లేని రాష్ట్రం
అయిదేళ్లు అయినా పునాది రాయి కూడా కనిపించకుండా పిచ్చి తుప్పలు లేచిపోయాయి.
రైతులు రాజధానికి భూమిని దానం చేసారు.
ఇవీ ఆ చర్చా నిర్వాహకుడు వదిలిన మాటలు. అమరావతి ఆంధ్ర రాజధాని అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి అక్కడే వున్నారు. శాసన సభ అక్కడే వుంది. అక్కడే వుంటాయి కూడా.
మరి ఆంధ్రను రాజధాని లేని తొలి రాష్ట్రం ప్రపంచంలోనే అని అనడం అంటే ఏమనాలి? ఈ కామెంట్ మీద నిజానికి ఎవరైనా పిల్ వేయాలి. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని అగౌరవపరిచారు. తమకు రాజధాని లేదని అంటున్నారు అంటూ నిలదీయాలి.
ఆ విషయం అలా వుంచి రెండో మాట చూద్దాం..''…అయిదేళ్లు అయినా పునాది రాయి కూడా కనిపించకుండా పిచ్చి తుప్పలు లేచిపోయాయి…''
అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం వున్నది ఏడాది మాత్రమే అయింది. అంతకు ముందు నాలుగేళ్లు చంద్రబాబే వున్నారు. మరి ఆయన నాలుగేళ్లు ఏం చేసినట్లు? పునాదిరాయి వేసిన నాలుగేళ్లు అలా ఎందుకు వదిలినట్లు? పోనీ ఆ సంగతి అలా వుంచుదాం.
అమరావతిలో ఇంత చేసాం, అంత చేసాం, మరి కొద్దిగా చేస్తే చాలు అని అనే వారు ఇప్పుడేమంటారు? ఈయ నేమో పిచ్చి తుప్పలు పెరిగిపోయాయి. సమాధి రాయి కనపడడం లేదు అంటారు. వాళ్లేమో అమరావతిలో బోలెడు కట్టేసాం. ఇంకొంచెం కట్టేస్తే చాలు అంటారు. ఎవరిది నిజం?
ఇక మరో మాట చూద్దాం..'' రైతులు రాజధానికి భూమిని దానం చేసారు…' రైతులు భూమిని అద్భుతమైన ఫ్యాకేజ్ కు ఇచ్చారు. ఫ్రీగా ఏమీ ఇవ్వలేదు. ఏటా కౌలు వస్తోంది.
గత ప్రభుత్వం వదిలిన కౌలు బకాయిలు కూడా ఈ ప్రభుత్వం క్లియర్ చేసింది. పైగా ఇప్పటికే రాజధాని ప్యాకేజ్ వెనుక వున్న మర్మం మీద సామాజిక మాధ్యమాల్లో అనేక లెక్కలు కళ్లకు కట్టినట్లు వున్నాయి. ఏ లాభం లేకపోతే, అమెరికా నుంచి వచ్చి మరీ భూములు కొని, ప్రభుత్వానికి 'దానం' చేసినట్లు?
మీడియా మొనగాళ్లు ఎవరైనా కూడా ఒకటి తెలుసుకోవాలి. జనాల కళ్లకు ఎన్నాళ్లో మీడియా గంతలు కట్టలేరు. సోషల్ మీడియా అనే అదనపు కళ్లు జనాలకు వున్నాయి. వారికి అన్ని నిజాలు తెలుసు. నిజాలని భ్రమింపచేసేవాటి వెనుక నిజాలు కూడా తెలుసు.