గత వారం రోజుల గణాంకాలను పరిశీలిస్తే.. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న మహారాష్ట్ర, దేశ రాజధాని ఢిల్లీల్లో కాస్త ఊరటకరమైన పరిస్థితులు కనిపిస్తున్నట్టున్నాయి. ఢిల్లీలో కరోనా ఉధృతి కాస్త తగ్గిందని తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రకటించారు. నంబర్లు ఈ విషయాన్ని చెబుతున్నాయి.
ఈ వారంలో నంబర్లను పరిశీలిస్తే.. యాక్టివ్ కేసుల విషయంలో మహారాష్ట్ర స్థానాన్ని కర్ణాటక తీసుకుంది. అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రంగా ఉండిన మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల్లో రోజువారీగా తగ్గుదల నమోదైంది. గత 24 గంటల్లో కూడా అక్కడ సుమారు 14 వేల స్థాయిలో యాక్టివ్ కేసులు తగ్గడం గమనార్హం. మరోవైపు కర్ణాటకలో మాత్రం రోజువారీగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది.
ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 71 వేల స్థాయిలో ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కేసుల కంటే రికవరీ అయిన కేసుల సంఖ్య రెట్టింపు ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు వేల వరకూ తగ్గింది. పరిస్థితుల్లో కాస్త నిమ్మళిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా చెబుతున్నారు.
దేశంలో కరోనా బాగా ప్రబలిన రాష్ట్రాలు ఇవి. అందులోనూ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. రెండో వేవ్ బాగా విజృంభించింది మహారాష్ట్ర నుంచినే. ఈ నేపథ్యంలో గత వారం రోజుల్లో అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గడం ఊరటను ఇచ్చే అంశం.
మే ద్వితీయార్థం నుంచి దేశంలో సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టవచ్చని ఇది వరకే నిపుణులు కొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి నేపథ్యంలో కరోనా బాగా వ్యాపించిన మహారాష్ట్ర, ఢిల్లీల్లో తగ్గుదల చోటు చేసుకుంటూ ఉంది. రానున్న వారంలో ఈ పరిస్థితి దేశ వ్యాప్తంగా కొనసాగితే.. సెకెండ్ వేవ్ నుంచి ఊరట దక్కే అవకాశం ఉంది.