ఉపాధి వేటలో విదేశాలకు వెళ్లిన భారతీయులు, అవకాశాలు కలిసి వచ్చి ఫారెన్ కంట్రీస్ కు వెళ్లి సంపాదిస్తున్న భారతీయులు… మొదట చేస్తున్న పని ఇండియాలో ఉన్న తమ వారికి డబ్బులు పంపడం. సంపాదించిన దాంట్లో మెజారిటీ భాగాన్ని ఇంటికి పంపడం భారతీయులకు ఎక్కడ పని చేసినా అలవాటే.
హైదరాబాద్ కు జాబ్ కు వెళ్లే వారు కూడా జీతంలో సగ భాగాన్ని అయినా సొంతూళ్లోని తల్లిదండ్రులకు పంపే వారు కోకొల్లలు ఉంటారు. ఇదే తీరు విదేశాలకు వెళ్లినా కొనసాగుతుందని వేరే చెప్పనక్కర్లేదు.
తమ వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసినా, విదేశాల్లో సంపాదించి స్వదేశంలో ఆస్తుల కొనుగోలు చేసినా.. భారీ మొత్తాలను అయితే భారతీయులు ఇండియాకు పంపుతున్నారు. గత ఏడాదికి సంబంధించి ఈ గణాంకాలను పరిశీలిస్తే.. విదేశాల నుంచి ఇండియన్స్ ఇండియాకు పంపిన మొత్తం కళ్లు చెదిరే స్థాయిలో ఉంది.
ఏడాది వ్యవధిలో మనోళ్లు ఇండియాకు పంపించిన డబ్బు మొత్తం ఆరు లక్షల కోట్లకు పైనే ఉంది! ఆరు లక్షల కోట్ల రూపాయలు అంటే మాటలేమీ కాదు. దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాలు కొన్నింటిని కలిపినా వాటన్నింటి వాస్తవిక బడ్జెట్ కన్నా ఈ మొత్తం ఎక్కువగా ఉంటుంది.
విదేశాల్లో సంపాదిస్తూ, అక్కడ తమ ఖర్చులు పోనూ మిగిలిన మొత్తాలనే వారు ఇండియాకు పంపిస్తుంటారని వేరే చెప్పనక్కర్లేదు. అయినా ఆరు లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని ఏడాది వ్యవధిలో పంపించారంటే భారతీయులు గ్రేటే. దీన్ని రోజువారీగా చూస్తే.. రోజుకు 1,670 కోట్ల రూపాయల మొత్తాన్ని విదేశాల్లోని భారతీయులు ఇండియాకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు!
ఇక ఎక్కువ మొత్తం బదిలీ అవుతున్నది అమెరికా నుంచి. ఆ తర్వాత యూఏఈ, సౌదీ నుంచి భారీ మొత్తాలు భారత్ కు బదిలీ అవుతున్నాయి. ఈ తరహాలో విదేశాల నుంచి ఎక్కువ డబ్బును పొందుతున్న దేశంలో ఇండియానే నంబర్ వన్ పొజిషన్లో ఉంది. చైనా రెండో స్థానంలో ఉంది.