అరెస్టైన ఎంపీ రఘురామకృష్ణం రాజు బెయిల్ కోసం కరోనా అంశాన్ని ఉపయోగించుకుంటున్నట్టుగా ఉన్నారు. నిన్న ఆయన హైదరాబాద్ లో అరెస్టు కాగా, ఆ అరెస్టుపై ఆయన తరఫు న్యాయవాదులు ఏపీ హై కోర్టును ఆశ్రయించారు.
రఘురామకృష్ణంరాజు అరెస్టు సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమంటూ ఆ న్యాయవాదులు హైకోర్టులో వాదించారట. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సుప్రీం కోర్టు అరెస్టులపై ఒక తీర్పు ఇచ్చిందట.
ఆ తీర్పు ఏమిటంటే.. ఏడేళ్ల స్థాయి జైలు శిక్ష పడే కేసుల్లో తప్ప ఇతర కేసుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో అరెస్టు వద్దని సుప్రీం కోర్టు సూచించిందట. ఆ తీర్పు ప్రకారం.. రఘురామకృష్ణంరాజు అరెస్టు విరుద్ధమని ఆయన తరఫు న్యాయవాదులు హై కోర్టులో వాదించారట.
అయితే ఆ వాదనను హైకోర్టు పట్టించుకోలేదని స్పష్టం అవుతోంది. వారి వాదన ఏదైనా వెళ్లి దిగువ కోర్టులో వినిపించాలని, సరాసరి హై కోర్టుకు ఎందుకు వచ్చారని న్యాయమూర్తి ప్రశ్నించినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ ను సెషన్స్ కోర్టులో దాఖలు చేసుకోవాలని హై కోర్టు స్పష్టం చేసిందట.
మొత్తానికి ఈ వ్యవహారంలో రఘురామకృష్ణంరాజును రక్షించుకోవడానికి ఆయన లాయర్లు కూడా కేవలం కరోనాను ప్రస్తావించినట్టుగా వార్తలు వస్తూ ఉండటం గమనార్హం. తమ క్లైంట్ తప్పు చేయలేదని లేదా ఆయనపై రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని ఆయన లాయర్లు వాదించినట్టుగా లేరు.
ఆయనపై మోపిన సెక్షన్ల తో ప్రస్తుత పరిస్థితుల్లో అరెస్టు చేయడం సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని మాత్రమే వారు వాదిస్తున్నారు. పరోక్షంగా ఇదెలా ఉందంటే.. ఆయనను అరెస్టు చేసుకోవచ్చు కానీ, కరోనా పరిస్థితుల్లో కాదు అన్నట్టుగా సామాన్యులకు బోధపడుతూ ఉంది!