నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు నిన్నరాత్రి హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణకు వచ్చింది.
రఘురామకృష్ణంరాజు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, సీఐడీ, ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు.
కనీసం ప్రాధమిక ఆధారాలు, అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా , విచారణ లేకుండానే ఎంపీని అరెస్ట్ చేశారని రఘురాముడి తరపు న్యాయవాది వాదించారు. దీనిపై జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని, కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించినట్టు ఆయన వాదించారు. దీనిపై కోర్టు అభ్యంతరం తెలిపింది. రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌కు సంబంధించి ఈ దశలో తాము జోక్యం చేసులేమని హైకోర్టు స్పష్టం చేసింది.
రిమాండ్ విధించకుండానే బెయిల్ పిటిషన్ ఎందుకు వేశారని హైకోర్టు ప్రశ్నించింది. కిందికోర్టుకు వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు. సీఐడీ తరపు న్యాయవాది స్పందిస్తూ …ఎంపీ అరెస్ట్‌కు దారి తీసిన పరిస్థితులను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎంపీని సీఐడీ కోర్టులో హాజరుపరచాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది.
దీంతో బెయిల్ కోసం రఘురాముడు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. మరికొన్ని రోజులు బెయిల్ కోసం వేచి చూడక తప్పని సరి పరిస్థితి. ఇదిలా ఉండగా హైకోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణంరాజును సీఐడీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు సీఐడీ అధికారులు తీసుకెళుతున్నట్టు సమాచారం.