ప్రవీణ్ కాండ్రేగుల…ఇప్పుడు ఈ కుర్రాడి పేరు టాలీవుడ్ లో వినిపించడం ప్రారంభమైంది. అలా అని నిన్నో మొన్నో గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కి విశాఖ నుంచి సరాసరి హైదరాబాద్ లో దిగిపోలేదు. పదేళ్లయింది ఇండస్ట్రీకి వచ్చి. అయితే అలా అని మళ్లీ ఏ డైరక్టర్ దగ్గరో అసిస్టెంట్ గా సెట్ అయిపోలేదు.
స్వంతంగా షార్ట్ ఫిలిం లు చేసుకుంటూ వస్తున్నాడు. షణ్మఖ్, వైవా హర్ష ఎక్సెట్రా జనాల బ్యాచ్ నే మనోడు కూడా. ఆఖరికి రాజ్ అండ్ డికే కు టచ్ లోకి వెళ్లారు అలా వచ్చింది నెట్ ఫిక్స్ లో పరుగెడుతున్న 'సినిమా బండి' దాని సంగతులేంటీ అన్నదాని కోసమే ఈ చిట్ చాట్
హాయ్ ప్రవీణ్
హాయ్ అండీ
సినిమా బండి ప్రయాణం ఎలా మొదలైంది
ఎలా అంటే…షార్ట్ ఫిలిం లు చేసుకుంటూ, చేసుకుంటూ రాజ్ అండ్ డికె కు టచ్ లోకి వెళ్లాం. లైన్ చెబితే షార్ట్ ఫిలిం చేయమన్నారు. నలభై నిమషాల షార్ట్ ఫిలిం చేసేసాం. అది వాళ్లకు భలే నచ్చింది. దీన్ని తామే సినిమా గా నిర్మిస్తాం అని ముందుకు వచ్చారు.
షార్ట్ ఫిలింగా చేసిన దానికి ఈ సినిమా సినిమాకు తేడా ఏమిటి?
నిడివి, మరింత క్వాలిటీ. నిజానికి రాజ్ డికె ఈ విషయంలో చాలా ఆలోచించారు. ఎంకరేజ్ చేసారు.షార్ట్ ఫిలిం లో చేసిన వాళ్లనే తీసుకుందాం అన్న ఐడియా వాళ్లదే. కాన్వాస్ కు తగినట్ల మార్పులు చేసాం
రాజ్ డికె ఇన్వాల్వ్ మెంట్ ఎంత వరకు?
స్క్రిప్ట్ ప్రతి అక్షరం చదవారు. సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ పై డబ్బు పెట్టారు తప్ప మరేమీ కలుగచేసుకోలేదు.
సినిమా లోకేషన్ ఎక్కడ?
ఆంధ్ర-కర్ణాటక బోర్టర్ లో ఎకాఎకి 30 రోజులు షూట్ చేసాం.
సినిమాకు పెద్దగా ఖర్చయి వుండదేమో?
అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే టెక్నికల్ గా ఎక్కడా రాజీ పడలేదు. మంచి కెమేరా వాడాం. మంచి క్వాలిటీ సౌండ్ కోసం ఎక్విప్ మెంట్ వాడాం. యాక్టర్లు, లొకేషన్ల తప్పిస్తే మిగిలినదగ్గర ఎక్కడా తగ్గలేదు.
రెస్పాన్స్ ఎలా వుంది
చాలా బాగుంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావడంతో దేశం అంతటి నుంచీ రివ్యూలు వస్తున్నాయి. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వుంది.
టాలీవుడ్ నుంచి ఏమైనా అభినందనం అందిందా?
చాలా మంది ఫోన్ లు చేసుకున్నారు. పెద్ద వాళ్ల దగ్గర నుంచి కూడా ఫోన్ లువస్తాయని ఆశిస్తున్నా..ఆశగా వున్నా.
ఈ తరహా సినిమాలేనా? అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా తీసే ఆలోచన వుందా?
నాకు పక్కా కమర్షియల్ సినిమాలు ఇష్టం. ముఖ్యంగా మణిరత్నం తరహా సినిమాలు తీయాలని కొరిక.
రాజ్ డికే ఏమంటున్నారు..మళ్లీ మరో సినిమా వుంటుందా?
వాళ్లు ఎప్పుడూ కొత్తదనాన్ని, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి సిద్దంగా వుంటారు. వాళ్లు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు. అందుకే.
ఓకె ఆల్ ది బెస్ట్ ప్రవీణ్
థాంక్యూ అండీ
విఎస్ఎన్ మూర్తి