దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షా 50వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6387 కేసులు నమోదవ్వడంతో (ఒక రోజు అత్యథికం కాదు) కరోనా బాధితుల సంఖ్య 151,767కు చేరుకుంది. ఇదే ఉధృతి కొనసాగితే.. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో పదో స్థానంలో ఉన్న భారత్.. మరో 2 రోజుల్లో 9వ స్థానానికి ఎగబాకడం ఖాయం. ప్రస్తుతం టాప్-10 కరోనా దేశాల్లో 9వ స్థానంలో టర్కీ, 8వ స్థానంలో జర్మనీ ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో 170 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4337కు చేరుకుంది. నిన్న 3935 మంది కోలుకోవడంతో.. మొత్తం డిశ్చార్జ్ ల సంఖ్య 64,426కు చేరుకుంది. ప్రస్తుతం 83వేల మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టలేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 2091 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 54,758కు చేరుకుంది. బాధాకరమైన విషయం ఏంటంటే.. వీటిలో 32,791 కేసులు ఒక్క ముంబయి మహానగరంలోనివే. మహారాష్ట్రంలో ఇప్పటివరకు 1792 మరణాలు సంభవిస్తే, అందులో 1065 మరణాలు ముంబయికు చెందినవే.
మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యథికంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 915 మంది మరణించారు. ప్రస్తుతం గుజరాత్ లో కేసుల సంఖ్య 14,821. అటు తమిళనాడులో 17,728, ఢిల్లీలో 14,465 కేసులున్నాయి.