మనుషుల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, వ్యాధి ఉందని బయటకు తెలిస్తే ఎవరైనా ఏమనుకుంటారేమో అనే మనస్తత్వాలు, ఇదే సమయంలో వ్యాధిని గాక మనిషిని ద్వేషించే తత్వం.. ఇవన్నీ భారతీయుల్లో కనిపించేవి. కరోనా వైరస్ విషయంలో మొదటి నుంచి ఈ రకమైన భయాందోళనలు ఇండియా విషయంలో ఉన్నాయి. అయితే మొదట్లో లాక్ డౌన్ ప్రభావమో, మరేమో కానీ.. కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించలేదు! ప్రపంచంలో బాగా అభివృద్ధి దేశాల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లో కరోనా విలయతాండవం చేసింది. ఆ సమయంలో ఇండియాలో కరోనా వ్యాప్తి బాగా తక్కువగా కనిపించింది.
లాక్ డౌన్ వల్ల అనుకున్నా.. ఉదయం పది వరకూ అప్పుడు కూడా ప్రజలు ఇష్టానుసారం తిరిగారు. ఏదేమైనా అప్పుడు కరోనా పూర్తి నియంత్రణలో కనిపించింది. లాక్ డౌన్ పరిమితులను మినహాయించాకా మాత్రం కరోనా రోజురోజుకూ పెరుగుతూ పోతూ ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే..ఈ పెరుగుదల ఎంత వరకూ? అనేది.
లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత మొదట్లో రోజుకు రెండు వేల స్థాయిలో కేసులు పెరిగాయి. ఇప్పుడు ఏకంగా రోజుకు 25 వేల స్థాయికి చేరిపోయాయి! ఇదే రేటున పెరుగుతూ పోతే.. అతి త్వరలోనే ఇండియా ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో కేసులు పెరుగుతున్న దేశంగా నిలిచినా నిలవొచ్చు! ప్రస్తుతం అమెరికా ఆ స్థానంలో ఉంది. గత వారం రోజుల్లో అమెరికాలో ఒక్కో రోజు 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి! ఒక రోజైతే 50 వేల మార్కు ను కూడా తాకింది యూఎస్. అయితే అమెరికాలో ఉన్న వైద్య సదుపాయాలను బట్టి వాళ్లు దాన్ని తట్టుకోగలరు. ఇండియాలో ఆ పరిస్థితి వస్తే..? ఊహించుకోవడానికే కష్టం. అయితే పెరుగుదల రేటును గమనిస్తే మాత్రం రోజుకు ఆ స్థాయిలో కేసుల పెరుగుదల మరెంతో దూరం లేదనే ఆందోళన కలుగుతుంది.
ఇప్పుడు కూడా ప్రజల నిర్లక్ష్య పూరిత ధోరణే కేసుల సంఖ్య పెరుగుదలకు కారణం అవుతోందని స్పష్టం అవుతోంది. కరోనా టెస్టులు చేయించుకోవడానికి వెళ్లే వాళ్లు బస్సుల్లో ప్రయాణించారట హైదరాబాద్ లో. బస్సు దిగగానే వారికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో వారు వచ్చిన బస్సులో ఎవరెవరు ప్రయాణించారో వారంతా ప్రమాదంలో పడ్డారని తెలుస్తోంది! తమ ఆరోగ్య పరిస్థితి అనుమానాస్పదంగా ఉన్నా, పబ్లిక్ ట్రావెల్స్ ఉపయోగించారంటే వాళ్ల తీరును ఏమనాలి?
అయితే ప్రజలను అంటే చాలదని, ప్రభుత్వం కూడా సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేదనే విమర్శలూ వస్తున్నాయి. హైదరాబాద్ లో కరోనా అనుమానితులను తరలించడానికి ఉన్న 108 లకూ, నమోదవుతున్న కేసులకూ సంబంధమే లేదని తెలుస్తోంది. అలాగే హోం క్వారెంటైన్లో ఉండాల్సిన వాళ్లు, ఆల్రెడీ కరోనా నిర్ధారణ అయిన వారితో ఫస్ట్- సెకెండరీ కాంటాక్ట్ లో ఉండిన వారు .. ఇళ్లకు పరిమితం కాకుండా ఇష్టానుసారం తిరుగుతున్నారని, ఇలాంటి వారి ట్రేసింగ్ పై తెలంగాణ ప్రభుత్వం సరిగా శ్రద్ధ చూపడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి.
కరోనా విషయంలో ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాలు హాట్ స్పాట్స్ గా నిలుస్తున్నాయి. హైదరాబాద్ అయితే మరింత ఆందోళనకరమైన పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుని, తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తోంది. ప్రజలందరిలోనూ ఈ మేరకు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చేంత వరకూ కూడా కేసుల సంఖ్య పెరుగుతూ పోతాయేమో!