ప్రపంచం చాలా మారిపోయింది, తెలుగు చిత్ర పరిశ్రమ తప్ప! గ్లోబలైజేషన్ తో ఎన్నో రంగాల్లో అనేక మార్పులు సంతరించుకున్నాయి! వినోద పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించే మాధ్యమాల్లో అనేక మార్పులు వచ్చాయి.. అలాంటి మాధ్యమాల్లో ముఖ్యమైనదైన సినిమాకు సంబంధించి సంచలన మార్పులు వచ్చాయి. అలాంటి మార్పులు కూడా తెలుగు చిత్ర పరిశ్రమను మాత్రం మార్చలేకపోయాయి, మార్చలేకపోతున్నాయి! బంధుప్రీతి అంటేనేం, వారసత్వం అంటేనేం.. తెలుగు చిత్ర పరిశ్రమను శాసిస్తున్న అంశం ఇది.
ఒకవైపు బాలీవుడ్ లో బంధుప్రీతి ఎక్కువ అని ఆ ప్రభావంతో నూతన నటీనటులు ఎదగలేకపోతున్నారని అక్కడి వారు అంటున్నారు. అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే.. తెలుగు చిత్ర పరిశ్రమలో కనిపిస్తున్న పరిస్థితులతో పోల్చుకుంటే బాలీవుడ్ ను శాసిస్తోంది అంటున్న బంధుప్రీతి చిన్నబోతుంది! బంధుప్రీతి ఉందన్న బాలీవుడ్ చాలా తెలుగు కన్నా చాలా చాలా మెరుగైన స్థితిలో ఉంది.
గత కొన్నేళ్లలో బాలీవుడ్ లో ఎంతమంది ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలు వచ్చారు, టాలీవుడ్ లో ఎంతమంది కొత్త వాళ్లకు అవకాశం దక్కింది అనే పోలికను బట్టి చూసినా ఈ విషయం అర్థం అవుతుంది. అలాగే బాలీవుడ్ లో బాగా సెటిలైన కుటుంబాలు తమ తనయులను హీరోలుగా సెటిల్ చేసుకోవాలని తపిస్తూ ఉండవచ్చు, అదే సమయంలో వాళ్ల కూతుళ్లు కూడా హీరోయిన్లు అవుతున్నారు. కూతుళ్లను దాచి, కొడుకులను మాత్రమే ప్రేక్షకుల మీద రుద్దే సంప్రదాయం బాలీవుడ్ లో కనిపించదు. తమ తనయులతో సమానంగా కూతుళ్ల ను కూడా చిత్రపరిశ్రమ వైపుకు ప్రోత్సహిస్తున్నారు అక్కడి సినీ కుటుంబాల వాళ్లు. టాలీవుడ్ లో అలాంటి పరిస్థితి లేదని వేరే చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లోని బిగ్ ఫ్యామిలీలు సినిమా రంగాన్ని ఒక కెరీర్ మార్గంగా చూస్తుంటే, టాలీవుడ్ లో మాత్రం దాన్నొక ఆధిపత్యంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ఇరవై సంవత్సరాల్లో ఇద్దరు ముగ్గురే!
గత ఇరవై సంవత్సరాల్లో టాలీవుడ్ లో ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోలు అయినవారు ఎంతమంది? వారిలో కెరీర్ ను ఎంతో కొంత సక్సెస్ ఫుల్ గా సాగిస్తున్న వారు ఎంతమంది? స్టార్లుగా ఎదిగిన వారు ఎంతమంది? అనే ప్రశ్నలకు వేళ్ల మీద లెక్కబెట్టతగిన సంఖ్య స్థాయిలో ఉంటుంది సమాధానం! రవితేజ, నాని, విజయ్, శర్వానంద్, నిఖిల్ వంటి నలుగురయిదుగురు మాత్రమే గత ఇరవై సంవత్సరాల్లో హీరోలుగా రాణించిన బయటి వాళ్లని చెప్పవచ్చు. చిన్న చిన్న పాత్రల స్థాయి నుంచి హీరోగా ఎదిగిన రవితేజ మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని ఇండస్ట్రీలో తన వారసులను కూడా ఇంట్రడ్యూస్ చేసే స్థాయికి ఎదిగాడు. తెలుగులోనే గాక శర్వానంద్ తమిళంలోనూ గుర్తింపును సంపాదించుకున్నాడు. హ్యాపీడేస్ తో పరిచయం అయిన నిఖిల్ కెరీర్ అలా కొనసాగుతూ ఉంది.
సంవత్సరానికి తెలుగులో వంద సినిమాలకు పైనే రూపొందుతూ ఉంటాయి. అలాంటి చిత్ర పరిశ్రమలో ఇరవై యేళ్లలో కనీసం రెండు వేల సినిమాలకు పైనే వచ్చి ఉంటాయి. అన్ని సినిమాల్లో కలిపి వారసులు కాకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హీరోల సంఖ్య నాలుగైదుకు మించి లేదంటే.. పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు!
ఇదే 20 యేళ్లలో వారసులు ఎంతమంది?
ఈ నంబర్ చాలా పెద్దగానే ఉంటుంది. స్టార్ హీరోల తనయులు, స్టార్ హీరోల మేనలుళ్లు, స్టార్ హీరోలు కూతుళ్లను పెళ్లాడిన వాళ్లు, మరోవైపు నిర్మాతల వాటా వేరే! కొన్ని పెద్ద సినిమాలు చేసిన నిర్మాతలు వాళ్ల పిల్లలను, బంధువులను హీరోలుగా బరిలోకి దించేస్తూ ఉన్నారు! ఈ మధ్య కొంతమంది రాజకీయ నేతలకూ సినిమాల మీద గాలి మళ్లింది.
ఇలా తెలుగు ప్రేక్షకులకూ మళ్లీ మూడింది! ఇండస్ట్రీలో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని వాళ్లూ తనయులను తెరకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఒక్కో ఫ్యామిలీ నుంచి క్రికెట్ టీమ్ కు తగినంత మంది హీరోలు తయారయ్యారు. తమ బ్లడ్డూబ్రీడు వేరంటూ తాము పుట్టిందే తెరపై హీరోలుగా చలామణి కావడానికి అన్నట్టుగా వీళ్లు బహిరంగంగానే అహాన్ని వ్యక్తం చేసేంత వరకూ వచ్చింది పరిస్థితి!
నిలదొక్కుకుంటే టాలెంట్ ఉన్నట్టా?
సినీ హీరోల వారసత్వాలకు వంత పాడే అభిమానులు చాలా మందే కనిపిస్తారు. తమ అభిమాన హీరో కొడుకో, మేనల్లుడో, బీరకాయ పీచు సంబంధంలో మరొకరో తెర మీదకు వచ్చినా ఈ అభిమానులు వాళ్లనూ ఆరాధించేస్తూ ఉంటారు. తొలి సినిమాకు ముందే వాళ్ల స్టిల్స్ వీళ్ల ఫేస్ బుక్ అకౌంట్ కవర్ ఫొటోలు అయిపోతూ ఉంటాయి. వీళ్ల ఆదరణే వారసత్వ హీరోయిజాలకు పెద్ద ఆశీర్వాదంగా మారింది. దీంతో హీరోలు కూడా భయం లేకుండా ఎంతమందిని వీలైతే అంతమందిని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇంట్లోని వారందరినీ హీరోలుగా చేసేస్తే ఇండస్ట్రీలో కూడా తమ మంద గట్టిగా ఉంటుందని వాళ్లు ఫీలవుతున్నట్టుగా ఉన్నారు. ఇలా తెలుగు ప్రేక్షకులు అడ్డంగా బుక్ కావాల్సి వస్తోంది. ఒక్కరిని ఆదరించారంటే, వారి చెప్పుకుని అరడజను మంది ఈజీగా వచ్చేస్తూ ఉన్నారు. ప్రేక్షకులకు వీళ్లు తమ టాలెంట్ నంత చూపించేస్తూ ఉన్నారు.
అయితే ఇక్కడ కొంతమంది వీరాభిమానులు ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. వారసత్వంతో వచ్చినంత మాత్రాన సక్సెస్ కాలేరు కదా, టాలెంట్ ఉంటేనే కదా ప్రేక్షకుల ఆదరిస్తారని ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. మరి తొలి సినిమాతోనే తిరస్కరం పొందిన ఎంతమంది సినీ వారసులు అంతటితో ప్రయత్నాలను ఆపేస్తున్నారు? ముక్కూమొహం కూడా సరిగాలేకుండా, నటనలో ఓనమాలు లేకుండా ప్రేక్షకులకు పరిచయం అయిన వాళ్లను హ్యాండ్సమ్ అంటూ తొలి సినిమాలోనే కీర్తిస్తారు. ప్రేక్షకులు ఆ సినిమాను తిరస్కరిస్తారు. అయితే అక్కడితో కథ అయిపోదు.
ఆ సినిమా పోతే ఇంకోటి. అది కూడా పోతే ఇంకోటి. హీరోలకు, నిర్మాతలకు ఉన్న శక్తియుక్తులతో అలా ఒకదాని తర్వాత మరోటి తమ వారసులతో సినిమాలు చేయించడం, చివరకు ఏ కథో- కామెడీనో కలిసి వచ్చి సినిమా హిట్ అయితే.. అతడు హీరో అయిపోతాడనమాట! ఐదారు సినిమాలు చేస్తే.. ఏదో ఒకటి హిట్టు కాకుండా పోదు, ఏ సినీ వారసుడు అయినా హీరో కాకుండా పోడు! ఇదీ స్థూలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పరిస్థితి. తండ్రులు, తాతలు తమ పరపతిని ఉపయోగించి ఎలాగోలా అరడజను సినిమాలను చేయించగలిగితే ఆ వారసుడు స్టార్ కిందే లెక్క. ఇంటి పేరుకు ఉండే అభిమానులు తోడవుతారు. అక్కడ నుంచి జయజయధ్వానాలే!
ఓపెన్ గా చెప్పాలంటే.. ఇండస్ట్రీలో అలా రుద్దుడుతోనే స్టార్లు అయిన వాళ్లు చాలా మంది కనిపిస్తారు. వారి తొలి సినిమాల్లో వాళ్ల నటనను చూసి ప్రేక్షకులు నవ్వుకున్నారు, వాళ్ల రూపాలు కామెడీగా ఉంటాయి. వీళ్లా హీరోలు అనే భావన కలగని సగటు ప్రేక్షకుడు ఉండడు. అయితే ఆ తర్వాత వాళ్లనే రుద్దడం స్టార్ట్ అవుతుంది. వీళ్లే మీ పాలిట హీరోలు, చూసి తీరాల్సిందే, చూడకపోతే మీ కర్మ అనే పరిస్థితులను తెలుగు సినీ ప్రముఖులు కల్పిస్తున్నది నిజం కాదా? ఈ సినీ వారసత్వ పోకడకు కులాభిమానులు కూడా యాడ్ అవుతున్నది నిజం కాదా?
తొలి సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు. వీలైతే రీమేక్ కథను తెచ్చుకుంటారు. హీరోలో మ్యాటర్ తక్కువైన సమయంలో కథతోనూ, ఇతర అదనపు ఆకర్షణలతోనూ నెట్టుకువచ్చేందుకు ప్రయత్నిస్తారు టాలీవుడ్ మేథావులు. ఏ లవ్ స్టోరీనో కలిసొచ్చి వారసత్వ హీరోకి తొలి సినిమాతోనే హిట్ దక్కితే సేఫ్, ఇక అతడు తెలుగు సినిమా పాలిట స్టారే! సినిమాలోని ఇతర విభాగాలన్నీ బాగా పని చేస్తే.. హీరో నటనా ప్రతిభ గురించి పట్టించుకునే ప్రేక్షకులు ఎంతమంది? అంతగా తొలి సినిమాలతో హిట్ కొట్టలేకపోతే ఏ రీమేక్ కథనో తెచ్చుకోవడం. చాలామంది వారసత్వ హీరోల తొలి తొలి సినిమాలు రీమేక్ సబ్జెక్టులే అయి ఉండటాన్ని కూడా గమనించవచ్చు. ఇదంతా వాళ్లను సేఫ్ జోన్లో ఉంచి, ఎలాగైనా నిలదొక్కుకునేందుకు చేసే ఏర్పాటు కాదా?
తినగ తినగ వేము తియ్యనుండు!
తినగ తినగ వేపాకు కూడా తీయగా ఉంటుందని శతకకర్త శతాబ్దాల కిందటే చెప్పారు. తెలుగు సినిమా ప్రేక్షకుల పరిస్థితి కూడా అదే! చూస్తూ చూస్తూ ఉండగా.. వాళ్లే హీరోలు అనిపిస్తారు. వాళ్లే మహానటులు అనిపిస్తారు! విమర్శకులు, సమీక్షకులు కూడా క్రమంగా అలవాటు పడిపోతారు. కిందటి సినిమా కన్నా ఇది మెరుగు అంటారు. నటనలో మెరుగుపడుతున్నాడంటారు, డైలాగ్ డెలివరీ బెటర్ అంటారు. ఇలా బెటర్ బెటర్ అంటూ.. వాళ్లే బెస్ట్ అనేంత భ్రమను కల్పించేస్తారు! ఎలాగూ వీళ్లకు సర్జరీలూ అందుబాటులోకి వచ్చాయి. ముక్కూ, మొహాలను సర్జరీలు చేయించే సదుపాయాలూ ఉండనే ఉన్నాయి.
మేకప్ సరేసరి. ఇక ప్రేక్షకులకు తొలి సారి విసుగు వచ్చినా, పెద్ద స్క్రీన్ మీద, అందమైన లైటింగులు వాడి.. వాళ్లనే అందంగా చూపించేసి.. క్రమక్రమంగా వాళ్లనే అందగాళ్లుగా, అందగాళ్లు అంటే అలానే ఉంటారన్నట్టుగా ప్రేక్షకులను నమ్మించడమే సినిమా కళగా మారింది! పేర్లు ప్రస్తావిస్తే చాలా మంది మనోభావాలు గాయపడతాయి. ఒకటని కాదు.. టాలీవుడ్ లోని అన్ని కుటుంబాల హీరోలూ ఈ బాపతే. ఒక్కోరి రూపాన్ని, ఒక్కోరి నటనా పటిమను చూసేసి మనం ఇన్నేళ్లుగా వాళ్లను వెండితెర వేల్పులుగా ఆదరిస్తూ ఉన్నాం. ఈ విషయంలో తెలుగు వాళ్ల ఓపికకు, వాళ్లు సహనానికి చేతులెత్తి దండం పెట్టొచ్చు.
టాలీవుడ్ లో సగటు సినీ ప్రేక్షకుల పరిస్థితితో పోలిస్తే, బాలీవుడ్ సినిమాలను చూసే వాళ్ల పరిస్థితి చాలా మెరుగు! పెట్టుబడిదారుల్లాంటి హీరోలు, నిర్మాతలు రుద్దిరుద్దీ మార్కెట్లో తమ వారసులను స్టార్లు అనిపిస్తుంటే, వాళ్లే నవమన్మథులు, వాళ్లే మహానటులు అనిపిస్తుంటే.. సగటు ప్రేక్షకుడు కూడా దాన్నే ఆమోదించ తప్పని పరిస్థితుల్లో ఉన్నాడు.
ఒకవేళ ఎవరైనా ఆమోదించకపోతే వాళ్లను వింతగా చూసే పరిస్థితి వచ్చేసింది తెలుగునాట! తెలుగు జనాల్లో చాలా మంది గుడ్డి అభిమానం ముసుగులోనో, మీడియా పదే పదే చెప్పడం వల్లనో అదే నిజమని నమ్మేసి.. ఈ సినిమా మాఫియా తీరును తప్పు పట్టే వాళ్లదే తప్పు అన్నట్టుగా తయారయిపోయారు. తాము వినోదం కోసం సినిమా చూస్తామంటూ, మిగతావి తమకు సంబంధం లేదని అంటూ ఉంటారు కొంతమంది. ఎవరైనా సినిమా చూసేది వినోదం కోసమే అందులో సందేహం ఏమీ లేదు. అయితే వినోదం ముసుగులో ఏం జరుగుతోందనే స్పృహ కూడా ఉండాలి!
ఈ తరంలో కూడా మార్పు లేనట్టే!
ఒకవైపు యూట్యూబ్ వంటి గొప్ప వీడియో మాధ్యమం ప్రేక్షకులకు చేరువైంది. ఎంతో మంది యువత షార్ట్ ఫిల్మ్స్ తో ముందుకు వచ్చే అవకాశం ఏర్పడింది. ఏడెనిమిదేళ్ల కిందటే తెలుగులో షార్ట్ ఫిల్మ్స్ విప్లవం పీక్స్ కు వెళ్లింది. అయితే అక్కడ నుంచి కూడా ఒకరిద్దరు యువ నటులు వచ్చారంతే! వాళ్ల సినీ ప్రయాణం కూడా ఒడిదుడుకులతోనే ఉంటుంది.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. గత ఐదారేళ్లలో సినీ వారసుల ఇంట్రడక్షన్లు మరింత పెరిగాయి! ఒక్కడంటే ఒక్కడు కూడా ఆగట్లేదు. ఒకరి తర్వాత మరొకరు వస్తూనే ఉన్నారు. వాళ్లే ఇండస్ట్రీలో మిగిలేలా ఉన్నారు. మళ్లీ అదే కథ. అదే రుద్దుడు. చివరకు అంతా ఆమోదించాల్సిందే!
వారసులకు, నటులకు తేడా అదే!
ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా వచ్చే హీరోలకు తొలి సినిమానే ఆఖరి అవకాశం లాంటిది. అది హిట్ అయితేనే లైఫ్. ఒకవేళ అలా హిట్టై ఎవరైనా నిలబడినా, ఆ తర్వాత వాళ్లకు దినదిన పరీక్షే అని హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఫెయిలయిన ఒక నటుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన తనకు మోడలింగ్ వల్ల హీరోగా అవకాశం వచ్చిందని అతడు చెప్పాడు. మోడల్ కావడం వల్ల తనకు అవకాశం లభించిందని, తొలి సినిమా బాగానే ఆడటంతో తనకు మరిన్ని అవకాశాలు వచ్చాయన్నాడు. అయితే తమ బోటి వాళ్లు ఒక్క ఫ్లాప్ వచ్చినా ఆ తర్వాత కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందట.
వరసగా రెండు, మూడు ఫ్లాప్ లు గనుక వస్తే.. ఇక మళ్లీ అవకాశాలు ఉండవని, అదే వారసుల పరిస్థితి మాత్రం భిన్నమని ఆ నటుడు వివరించాడు. వారసత్వంతో హీరోలుగా వచ్చే వారికి వరస ఫెయిల్యూర్లు వచ్చినా, మరో సినిమా అవకాశాన్ని ఇప్పించేలా కుటుంబ అండ ఉంటుందని అతడు విశ్లేషించాడు. అలా ఏదో ఒక సినిమా హిట్ అయితే మళ్లీ మళ్లీ కొన్ని సినిమాలు పోయినా వాళ్లకు ఇబ్బంది ఉండదని ఆ నటుడు వివరించాడు. తెలుగు సినీ పరిశ్రమ వారసులకు మాత్రమే అనే పరిస్థితి ఇలా ఏర్పడిపోయిందని అతడు విశ్లేషించాడు.
తెలుగు సినిమా తీరును గమనిస్తే అతడి విశ్లేషణ వందకు వందశాతం నిజమని అర్థం అవుతుంది. వారసులకు ఈ సినిమా కాకపోతే మరో సినిమా, అదే బయటి వాళ్లకు మాత్రం దేనికదే ఆఖరి సినిమా! అనే పరిస్థితి వల్లనే ఇండస్ట్రీలో వారసులు మాత్రమే మిగులుతున్నారు, మిగతా వాళ్లు అడ్రస్ లేకుండా పోతున్నారని స్పష్టం అవుతుంది.
స్టార్ ల వారసులు ఎందుకు దర్శకులు కాలేరు?
సినీ కుటుంబం నుంచి వచ్చిన వారికి ఆ రంగంలో ప్రతిభ ఉంటుందని, అందుకే వాళ్లు సక్సెస్ అవుతారని మరి కొందరు ఒక థియరీ చెబుతుంటారు. లాయర్ కొడుకు లాయర్, డాక్టర్ కొడుకు డాక్టర్ అంటూ.. ఉంటారు. అదంతా జన్మతః వస్తుందంటారు. మరి ఎందుకు ఏ స్టార్ హీరో కొడుకు కూడా ఒక డైరెక్టరో, ఒక కథా రచయితో, మరో మాటల రచయితో, ఇంకో టెక్నీషియనో కాడే! ఇంట్లో సినీవాతావరణం ఉన్నప్పుడు వాళ్లో ఆ రంగం మీద ఆసక్తి కలిగితే.. 24 క్రాఫ్ట్ లో ఏ రంగం మీదా దృష్టి పెట్టరు, ఒక్క నటన మీద తప్ప! ఎందుకంటే.. నటన ఒక్కటే మెదడుతో అవసరం లేకుండా, బుర్ర ఇంట్లో పెట్టి వచ్చి చేయగల పని అని అంటారు కొందరు సినిమా వాళ్లే!
ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి..?
సినిమా అంటే ఇలానే ఉంటుంది, సినిమా హీరో అంటే మరో సినీ హీరోకే పుట్టి ఉంటాడు, అందగాడు అంటే ఫలానా హీరో కొడుకులానే ఉంటాడు.. అనుకునే వాళ్లకు ఏ సమస్యా లేదు! వాళ్ల చిన్ని సినీ ప్రపంచంలో వాళ్లు హ్యాపీ. ఇది మొదటి కేటగిరి. ఇక మిగతా వాళ్లలో ఏంటిది.. అనే భావన కొంత కలిగినా, నెమ్మదినెమ్మదిగా అలవాటు పడిపోతారు. ఫస్ట్ కేటగిరిలోని ప్రేక్షకులు బాగుందన్న సినిమా బాగుందని వీళ్లూ నెమ్మదినెమ్మదిగా ఒప్పుకుంటారు. తొలి సినిమా అప్పుడు ఏ సినీ వారసుడినో చూసి విసుక్కొన్నా, అతడే ఫలానా స్టార్ అని ఫస్ట్ కేటగిరిలోని ప్రేక్షకులు, మీడియా చెప్పిందటే.. వీళ్లు కూడా తప్పక రాజీ పడిపోతారు! ఇది రెండో కేటగిరి పరిస్థితి.
ఈ రెండు కేటగిరీ ప్రేక్షకులే తెలుగు సినీ మాఫియా బలం! సినీ హీరోలుగా వాళ్లనే ఆమోదించక తప్పని పరిస్థితుల్లోకి ప్రేక్షకులను నెట్టేసింది ఆ మాఫియా, కొన్నాళ్లకు తామే రాజకీయ నేతలం అనే పరిస్థితిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ మాత్రం నెగ్గుకు రాలేకపోతున్నారు. సినీహీరోలుగా తమను తప్పక భరించిన జనాలు నాయకులుగా కూడా భరిస్తారని సినిమా హీరోలు అనుకున్నారు. అయితే ప్రత్యామ్నాయం లేకే వీళ్లంతా హీరోలుగా చలామణి అవుతున్నారు, ప్రత్యామ్నాయం ఉన్న చోట వీళ్ల చోటేమిటో అదే తెలుగు ప్రజలే చూపించారు సుమా!
-జీవన్ రెడ్డి. బి