దేశంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు ఐదు నెలల కనిష్టానికి చేరింది. 139 రోజుల తర్వాత ఇండియాలో అతి తక్కువ స్థాయిలో రోజువారీ కేసుల సంఖ్య నమోదైంది. గత ఇరవై నాలుగు గంటలకు సంబంధించిన డేటా ప్రకారం.. ఒక్క రోజు వ్యవధిలో దాదాపు 28,204 కేసులు నమోదయ్యాయి. 139 రోజుల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య ఇంత తక్కువ స్థాయిలో నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.
సెకెండ్ వేవ్ తీవ్రరూపం దాల్చిన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలి సారి. మరి ఇక్కడ నుంచి కేసులు ఆరోహన క్రమంలో కొనసాగుతాయా, అవరోహన క్రమాన్ని అందుకుంటాయా? అనేదే చర్చనీయాంశం అవుతోంది.
సెకెండ్ వేవ్ జూన్ నెలాఖరుకే పూర్తిగా క్షీణిస్తుందని పరిశోధకులు అంచనా వేసినా, అయితే జూలై నెలంతా రోజు వారీ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగింది. రోజువారీగా నలభై వేల స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆగస్టు తొలి వారంలో కూడా అదే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రత్యేకించి కేరళలో గత కొన్నాళ్లుగా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
రోజువారీ కేసుల సంఖ్య 20 వేలకు పై స్థాయిలో కూడా నమోదయ్యింది. ఇలా మూడో వేవ్ మొదలయ్యిందనే అంచనాలూ ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి కేరళలో కూడా ఇప్పుడు తక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో కేరళలో దాదాపు 13 వేల స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
ఇప్పుడు కూడా దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఇదే సమయంలో గమనించాల్సిన అంశం.. కేసులను గుర్తించడంలో కేరళ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అక్కడ ప్రతి ఆరు కేసుల్లోనూ ఒక కేసును కచ్చితంగా డిటెక్ట్ చేస్తున్నారని సెరో సర్వే తేల్చింది. ఇప్పుడు తమ వద్ద కేసులే లేవని చెబుతున్న యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో వందకు ఒక కేసును కూడా గుర్తించలేదని కూడా ఐసీఎంఆర్- సెరో సర్వేలో పేర్కొన్నారు.
ఏదేమైనా.. మూడో వేవ్ ప్రబలే సమయం అనే అంచనాలున్న సమయంలో, కేసుల సంఖ్య కాస్తో కూస్తో తగ్గడం ఊరటను ఇస్తున్న అంశమే. ఆగస్టు గడిస్తే కానీ మూడో వేవ్ ఇప్పుడప్పుడేనా, మరి కొన్నాళ్ల తర్వాతనా లేక అసలు ఉండదా అనే అంశంపై ఎంతో కొంత స్పష్టత కూడా రాదు.