కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందని ఒకవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కరోనాను లైట్ తీసుకోవద్దని, అనవసరంగా బయటకు రావొద్దని వారు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు జనాలు కరోనాను సీరియస్ గా తీసుకోవడం లేదు.
ఈ క్రమంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం గమనార్హం. గత మూడు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. రోజువారీగా 50 వేల స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం.
శీతాకాలంలో కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందని పరిశోధకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ప్రస్తుతం యూరప్ లో సెకెండ్ వేవ్ కొనసాగుతూ ఉంది. ఈ పరిణామాల్లో అక్కడి ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్లకు వెళ్లాయి.
యూకేలో నాలుగు వారాల లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇతర యూరప్ దేశాల్లోనూ లాక్ డౌన్ ప్రక్రియలు మొదలయ్యాయి. ఇండియాలో కూడా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ ఉండటం గమనించాల్సిన అంశం.
పరిస్థితి ఇలా ఉంటే.. ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి కొన్ని చోట్ల ఉప ఎన్నికలూ జరుగుతున్నాయి. ఏపీలో స్థానిక ఎన్నికలను జరపడానికి ఎన్నికల కమిసనర్ చాలా ఉత్సాహం చూపుతున్నారు.
అమెరికాలో ఎన్నికల ప్రక్రియ వల్ల సుమారు లక్ష మందికి కరోనా సోకిందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ట్రంప్ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొన్న వారికే కొన్ని వేల సంఖ్యలో కరోనా సోకిందని అంటున్నారు. వారిలో వందల మంది మరణించారని కూడా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది.
ఈ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఇండియాలో మళ్లీ కరోనా తీవ్ర స్థాయికి చేరే అవకాశాలు ఉంటాయేమో! చేతులు కాలాకా ఆకులు పట్టుకోవాల్సిన స్థితికి తీసుకెళ్లాలా ఉన్నారు!