ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు మూడేళ్లు పూర్తవుతున్నాయి. అసలు నాయకుడంటే ఎలా ఉండాలి, ఒక పని మొదలు పెడితే దాన్నిపూర్తి చేసేంతవరకు ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనంతో వ్యవహరించాలి, అవమానాలు, ఆటుపోట్లు, కత్తిపోట్లు.. ఎదురైనా ఎలా తట్టుకుని ఉండాలి అనడానికి నిలువెత్తు నిదర్శనం జగన్.
ఒకరకంగా ప్రజా సంకల్ప యాత్ర జగన్ ని బాగా రాటుదేల్చింది. ఆటుపోట్లని తట్టుకునే శక్తిని మరింతగా పెంచి, ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అందించింది.
మరిప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ భావి నాయకుడు లోకేష్ ఏం చేస్తున్నారు? కరోనా పేరు చెప్పి 5నెలలు అసలు రాష్ట్రానికే దూరంగా హైదరాబాద్ లో ప్రవాస జీవితం గడిపి వచ్చారు. వస్తూ వస్తూనే.. పరామర్శ యాత్రల పేరుతో 5 రోజులు హడావిడి చేశారు.
గోదావరి జిల్లాలు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో కలియదిరిగి రైతులతో నేరుగా మాట్లాడారు. బురదలో దిగారు, జనం భుజంపై చెయ్యి వేశారు, ట్రాక్టర్ తో వచ్చీరాని ఫీట్లు చేసి పాట్లు పడ్డారు.
పోనీ ఏదోలాగా జనంలోకి వచ్చారని టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతోషపడుతున్నవేళ.. సడన్ గా మొహం చాటేశారు. మళ్లీ ట్విట్టర్ తో కాలక్షేపం చేస్తున్నారు.
ప్రజా నాయకుడంటే.. ఎప్పుడూ ప్రజల్లోనే ఉండాలి. వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మరింత గట్టిగా ఉండాలి, మరింతగా ప్రజల్లో కలసిపోయి వారికి తామున్నామనే భరోసా కల్పించాలి.
ఇక్కడ చంద్రబాబు, లోకేష్ పూర్తిగా రివర్స్.. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు జనాల్లోకి రాకూడదనేది బాబు ఆలోచన. పోనీ కొడుకు అయినా వచ్చాడనుకుంటే.. సెకండ్ వేవ్ అనే పేరు వినపడే సరికి మళ్లీ తుర్రుమన్నారు.
కరోనాకి భయపడి పారిపోయే నాయకులు.. ఇక జనాల సమస్యలు ఏం ఆరుస్తారు, తీరుస్తారు. అసలు ఇలాంటి నాయకుల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఎలా పైకి ఎదుగుతారు. మూడేళ్లవుతున్నా జగన్ పాదయాత్ర గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే.. ఎక్కడా విరామం ఇవ్వకుండా సాగిపోవడమే కారణం.
తమ కోసం వేల కిలోమీటర్లు నడచి వస్తున్న నాయకుడిపై జనం గంపెడాశలు పెట్టుకున్నారు. 14 నెలలపాటు జనంతో మమేకమై ఇస్తూ వచ్చిన హామీలను నమ్మి అందలమెక్కించారు. ఏడాది కాలంలోనే ఆ హామీల అమలు తీరు చూసి సంబరపడుతున్నారు.
నాయకుడంటే అలా ఉండాలి. అలుపు రాగానే ఇంటికి పరిగెత్తడం, ట్రాక్టర్ బెదరగానే భయపడి పారిపోవడం.. ఇలా చేస్తే.. ఇంకో పాతికేళ్లకు కూడా లోకేష్ ప్రజల నాయకుడు కాలేరు.