టిడ్కో ఇళ్లు స్వాధీనం చేసుకుంటామంటూ లబ్ధిదారుల్ని రెచ్చగొడుతున్న టీడీపీ.. అదే సమయంలో ఇళ్ల స్థలాల కేటాయింపు విషయాన్ని కూడా రాద్ధాంతం చేయాలని చూస్తోంది.
వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాలు అందుకోబోతున్న లబ్ధిదారుల్ని కూడా తమతో కలసి ఆందోళనల్లో పాల్గొనాలనే పిలుపునిస్తోంది. నా ఇల్లు నా సొంతం అంటూనే.. నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అనే మరో పాయింట్ ని కూడా హైలెట్ చేస్తూ టీడీపీ నేతలు రంకెలేస్తున్నారు. సంక్రాంతి టార్గెట్ పెట్టి మరీ రెచ్చిపోతున్నారు.
టిడ్కో పాపం టీడీపీదే కాబట్టి.. ఆ ఇళ్ల కోసం ఆ పార్టీ నేతలు చొరవ తీసుకున్నారంటే అర్థం ఉంది. మరి ఇంటి స్థలాల పథకానికి టీడీపీకి అసలేంటి సంబంధం. టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఆ పాయింట్ లేదు.
కేవలం నవరత్నాల హామీగా 30 లక్షలమంది పేదలకు ఇళ్ల స్థలాలను అందివ్వబోతున్నారు సీఎం జగన్. ఈపాటికే ఆ కార్యక్రమం మొదలవ్వాల్సి ఉన్నా.. కోర్టు కేసుల కారణంగా వాయిదా పడింది. ఈ కేసుల వ్యవహారంలో కూడా టీడీపీ హస్తం ఉందనే విషయం బహిరంగ రహస్యం.
అంటే.. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు దక్కకపోవడానికి కారణం టీడీపీ, అదే సమయంలో ఇళ్ల స్థలాల పంపిణీ కాకుండా ఆగిపోడానికి కారణం కూడా టీడీపీయే.
మరి ఏమొహం పెట్టుకుని లబ్ధిదారుల వద్దకు వెళ్లి మాతో కలసి పోరాటం చేయండి అని టీడీపీ నేతలు అడుగుతారు. ఒకవేళ అడిగినా.. వారికి చీవాట్లు మాత్రమే మిగులుతాయి.
ఈమధ్య టిడ్కో అపార్ట్ మెంట్ల వద్ద చేసిన హడావిడిలో కూడా లబ్ధిదారులెవరూ కనిపించలేదు, కేవలం టీడీపీ కార్యకర్తలే ఉన్నారు. అదే ఊపులో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాల జోలికి వస్తే మాత్రం టీడీపీకి చెప్పుదెబ్బలు తప్పకపోవచ్చు.
ఇళ్ల స్థలాలు అందుకోబోతున్న లబ్ధిదారులంతా టీడీపీ కేసులతో తమకి ఆలస్యం, అన్యాయం జరుగుతోందనే కోపంలో ఉన్నారు. ఇప్పుడు సింపతీ చూపించడానికి వెళ్తే టీడీపీ నేతలపై ప్రజలు తిరగబడటం మాత్రం ఖాయం.