మార్చి నెల రెండో వారం పూర్తయ్యే సరికి ప్రపంచంలో కరోనా పెద్దగా వ్యాపించని దేశాలు కొన్ని ఉన్నాయి. పెద్దగా అంటే.. వాటిల్లో కరోనా కేసుల సంఖ్య వందలోపు మాత్రమే. అయితే అప్పుడే ఆ దేశాలు అలర్ట్ అయ్యాయి. లాక్ డౌనే ప్రకటించారో, సామాజిక దూరమే పాటించాలని తమ తమ దేశాల ప్రజలకు చెప్పారో కానీ.. చర్యలు అయితే మొదలయ్యాయి.
ఇండియాలో మార్చి మూడో వారం పూర్తవుతున్నప్పుడు లాక్ డౌన్ మొదలైంది. దాదాపు అదే సమయంలో చాలా దేశాలు అలర్ట్ అయ్యాయి. వాటన్నింటిలోనూ కేసుల సంఖ్య చాలా తక్కువ. అలాంటి వాటిల్లో రష్యా కూడా ఒకటి. మార్చి నెలాఖరు వరకూ కూడా రష్యాలో కేసుల సంఖ్య ఏ మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.
అయితే ప్రపంచం అంతా అలర్ట్ అవుతుండే సరికి, రష్యన్ సుప్రిమో వ్లాదిమిర్ పుతిన్ కూడా తన దేశాన్ని అలర్ట్ చేశారు. సామాజికదూరం పాటించాలని ఆయన ప్రజలను ఆదేశించారు, అలాగే లాక్ డౌన్ ఆదేశాలను కూడా ఇచ్చారు. అవతల యూరప్, ఇవతల ఆసియా.. రెండు వైపులా కరోనా వ్యాపిస్తుండే సరికి రష్యా కూడా అలర్ట్ అయ్యింది. ఎంతైనా బాగా అభివృద్ధి చెందిన దేశం. కాబట్టి.. అలర్ట్ గానే కనిపించింది.
అయితే ఐదు వారాల తర్వాత పరిస్థితి ఏమిటి? అంటే.. ఇప్పుడు కరోనా కేసుల విషయంలో రష్యా ముందు వరసలోకి వచ్చింది! ఎంతలా అంటే చైనా ను కూడా దాటేసింది. రష్యాలో ఇప్పటికే 87 వేలకు పైగా కరోనా కేసులను గుర్తించారట! వీరిలో 794 మంది మరణించినట్టుగా రష్యా ప్రకటించింది.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. మార్చి నెలలోనే పబ్లిక్ ప్లేస్ లను రష్యా మూసేసింది. లాక్ డౌన్ ను అనౌన్స్ చేసింది. ఆ మేరకు మార్చి నెలాఖరు వరకూ కూడా రష్యాలో పెద్దగా కేసులు లేవు. ఎంతలా అంటే..రష్యాకు చైనా ఏదో మందు ఇచ్చిందని, అందుకే రష్యాలో కేసుల సంఖ్య అస్సలు లేదనే అభిప్రాయాలే వినిపించాయి అప్పట్లో. అయితే ఏప్రిల్ నెల మొదలు నుంచి రష్యాలో కరోనా కేసులు వెలుగు చూశాయి. లాక్ డౌన్ అమల్లో ఉన్నా.. 28 రోజుల్లోనే కేసుల సంఖ్య 87 వేలను దాటేసింది! చైనాను
మించి పోయింది.
చైనాతో సరిహద్దులను మూసేసి చాలా రక్షణ చర్యలనే తీసుకుంది రష్యా. అయినా కరోనా కేసుల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన, ఆలోచించాల్సిన విషయం మరోటి ఉంది.. ఇండియా, రష్యా దాదాపు ఒకే సారి లాక్ డౌన్ ను ప్రకటించాయి. రష్యాలో పుతిన్ ఆదేశాలకు తిరుగుండదు. కాబట్టి అక్కడ కూడా స్ట్రిక్ట్ గానే లాక్ డౌన్ అమలయి ఉండొచ్చు. కానీ.. కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగింది.
ఇండియా, రష్యాలు దాదాపు సమస్థాయిలో లాక్ డౌన్ ను పాటించాయి అనుకుంటే.. మన దేశంతో పోలిస్తే రష్యాలో కరోనా కేసుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంది! ఇండియాతో పోలిస్తే రష్యా జనాభా చాలా చాలా తక్కువ! ఏ పదో వంతో ఉంటుంది. అయినా కేసుల సంఖ్యలో మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది రష్యా. ఇదంతా అంతుబట్టని అంశమే! కొంతమంది చెబుతున్నట్టుగా ఇండియాలో కరోనా వ్యాప్తి అంతదూకుడుగా లేదా? ఇండియా, రష్యాల్లో ఒకే సమయంలో జాగ్రత్త చర్యలు మొదలైన నేపథ్యంలో, అప్పటికి కేసుల సంఖ్య సమస్థాయిలో ఉన్న నేపథ్యంలో.. ఆ తర్వాత రష్యాలో కేసులు భారీగా నమోదు కావడం, ఇండియాలో మాత్రం అందులో మూడో వంతు స్థాయిలోనే ఉండటం.. ఇండియన్ వాతావరణంలో కరోనా దూకుడు తగ్గుతోందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ అంశాల గురించి మరింత లోతైన అధ్యయనం చేస్తే.. ఏవైనా సమాధానాలు లభిస్తాయేమో!