ఏపీలో కరోనా భయం ఎంతలా ఉందంటే..?

ఏపీలో తొలి కరోనా కేసు బైటపడింది. 3 రోజుల నుంచి పుకారు అనుకున్నది కాస్తా నిజమైంది. కరోనా కేసు పాజిటివ్ అని ప్రకటించడానికి అధికారులు కాస్త ఇబ్బంది పడ్డారు కానీ దాచలేకపోయారు. దీంతో ఒక్కసారిగా…

ఏపీలో తొలి కరోనా కేసు బైటపడింది. 3 రోజుల నుంచి పుకారు అనుకున్నది కాస్తా నిజమైంది. కరోనా కేసు పాజిటివ్ అని ప్రకటించడానికి అధికారులు కాస్త ఇబ్బంది పడ్డారు కానీ దాచలేకపోయారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో అలజడి మొదలైంది. ముఖ్యంగా కేసు బైటపడిన నెల్లూరు జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

కరోనా సోకిన వ్యక్తి ఉంటున్న నెల్లూరులోని చిన్నబజారు ఏరియా మొత్తం ఖాళీ అయింది. చుట్టుపక్కలవాళ్లు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు, షాపులు మూతపడ్డాయి. ఆ ప్రాంతానికి పోవాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇళ్లు వదిలిపెట్టి దూరంగా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. సినిమా హాళ్లు మూసేయండని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. షాపింగ్ మాల్స్ కూడా కొన్నిరోజులు మూతపడే అవకాశాలున్నాయి.

అయితే వ్యాపార వర్గాలు గగ్గోలు పెడతాయనే ఉద్దేశంతో ఆ దిశగా ఆదేశాలివ్వడానికి జంకుతున్నారు అధికారులు. ఓ అంతర్జాతీయ సెమినార్  కోసం నెల్లూరు వచ్చిన విదేశీ బృందం కూడా ఇప్పుడు వైద్యఆరోగ్య శాఖ పర్యవేక్షణలోనే ఉంది. వీరు ఏ హోటల్ లో బస చేశారనే విషయం బైటకు రానీయకుండా అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఓవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు, మరోవైపు నామినేషన్ల మధ్య ఎలాంటి ప్రకటన చేయాలన్నా అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

ఇది కేవలం నెల్లూరుకి సంబంధించిన విషయమే కాదు, తిరుమల కొండపై కూడా ఇలాంటి ఆందోళనకర వాతావరణమే నెలకొని ఉంది. భక్తుల రాక క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు చెందినవారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా కరోనా బైటపడింది కాబట్టి, మెల్లగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా కొండకి రావడం తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఇక సినిమాహాళ్లు మూసేయాలని అధికారులే చెప్పడంతో.. కొత్త సినిమాల విడుదలపై కచ్చితంగా ఇది ప్రభావం చూపిస్తుంది. పరీక్షలు, ఎన్నికల సందర్భంగా సినిమాలని పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటున్నవారికి కొత్తగా కరోనా భయం పట్టుకుంది. థియేటర్లే లేకపోతే ఇక రిలీజ్ లు ఎందుకుంటాయి. అందులోనూ జనం వస్తారో రారో కచ్చితంగా అంచాన వేయలేరు కాబట్టి వాయిదాకే నిర్మాతలు మొగ్గుచూపుతారు. మొత్తమ్మీద, మనకు లేదులే, మనకు రాదులే అనుకున్న కరోనా లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్ గా ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తోంది.

బాబుకి దెబ్బ మీద దెబ్బ

నాకు స్వయంవరం అంత అవసరమా ?